సాక్షి, అమరావతి: ఈబీ–5 వీసా.. ఇదీ ప్రస్తుతం అమెరికాలోని భారతీయ వృత్తి నిపుణుల సరికొత్త తారకమంత్రం. అమెరికాలోని ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తుండటంతో ఆ దేశంలో కొనసాగేందుకు భారతీయ వృత్తి నిపుణులకు కనిపిస్తున్న మరో ప్రత్యామ్నాయం. అమెరికాలో వృత్తి నిపుణులుగా కొనసాగేందుకు ఆ దేశంలో పెట్టుబడిదారులుగా మారుతున్నారు.
ఇందులో భాగంగా అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ కేటగిరీలో ఈబీ–5 వీసాల కోసం అమెరికాలోని భారతీయులు అత్యధికంగా దరఖాస్తులు చేస్తున్నారని ‘యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రియల్ ఎస్టేట్‌లో మన వాళ్ల పెట్టుబడులు..
ఆర్థిక మాంద్యం ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంలో అమెరికాలోని దిగ్గజ ఐటీ కంపెనీలతోపాటు ఇతర కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. దాంతో హెచ్1బీ వీసా మీద ఆ దేశం వెళ్లిన భారతీయులు వెనక్కి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికాలోనే కొనసాగాలంటే మరో కంపెనీల్లో ఉద్యోగం దక్కించుకోవాలి. అందుకు అవకాశాలు కూడా పెద్దగా లేకపోవడంతో భారతీయ వృత్తి నిపుణులు ఈబీ–5 వీసా కోసం దరఖాస్తులు చేస్తున్నారు.
అందుకోసం ఆ దేశంలో పెట్టుబడులు పెట్టే కన్సల్టెన్సీలతో భాగస్వాములుగా మారుతున్నారు. ఎక్కువగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కన్సల్టెన్సీలు కనీసం 20 మందిని ఓ గ్రూప్‌గా ఏర్పరచి ఒక్కొక్కరి నుంచి 8 లక్షల అమెరికన్ డాలర్ల చొప్పున 16 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.131.39 కోట్ల) నిధిని సేకరిస్తున్నాయి. ఆ నిధులను వివిధ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చేపడుతున్న రెంటల్ అపార్ట్‌మెంట్లు, భవనాలు, హోటళ్లు తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడిగా పెడుతున్నాయి.
ఆ విధంగా పెట్టుబడి పెడుతున్న వారు ఆ వ్యాపారంలో క్రియాశీలకంగా ఉండటంగానీ ప్రత్యక్షంగా ఎవరికీ ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరంగానీ లేదు. వారు పాసివ్ పెట్టుబడిదారులుగా ఉంటారు. పెట్టిన పెట్టుబడిపై వారికి వడ్డీ లభిస్తుంది కూడా. దాంతోపాటు పెట్టుబడిదారు హోదా దక్కుతుంది. ఆ హోదాపై ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేసి పొందుతున్నారు. ఆ వీసాపై అమెరికాలో ఏ ప్రాంతంలోనైనా పనిచేసేందుకు వారికి అవకాశం దక్కుతుంది. ఈబీ–5 వీసా కింద ఐదుగురు కుటుంబ సభ్యులు అమెరికాలో నివసించేందుకు అవకాశముంది.
పెరుగుతున్న ఈబీ–5 వీసాలు
భారతీయులకు ఈబీ–5 వీసాల జారీ పెరుగుతోంది. 2019లో 756 మంది భారతీయులు ఈబీ–5 వీసాలు పొందగా.. 2022లో ఏకంగా 1,381 మందికి వీటిని జారీ చేయడం విశేషం. 2016తో పోలిస్తే ఈబీ–5 వీసాలు పొందిన భారతీయుల సంఖ్య 400 శాతం పెరిగింది. 2022లో అమెరికా మొత్తం 10,885 ఈబీ–5 వీసాలు జారీచేసింది. వాటిలో 1,381 వీసాలతో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో చైనా, మూడో స్థానంలో వియత్నాం ఉన్నాయి. ఇక 2023లో 14,200 ఈబీ–5 వీసాలు జారీచేయాలని యూఎస్‌సీఐఎస్ భావిస్తోంది.
ఈబీ–5 వీసా అంటే..
అమెరికాలో గ్రీన్‌కార్డ్‌కు దాదాపు సమానమైన గుర్తింపు ఉన్నదే ఈబీ–5 వీసా. అంతటి ప్రాధాన్యమున్న ఈ వీసా పొందాలంటే వ్యక్తులు అమెరికాలో కనీసం 8 లక్షల అమెరికన్ డాలర్లను (భారతీయ కరెన్సీలో రూ.6.57 కోట్లు) పెట్టుబడిగా పెట్టడంతోపాటు కనీసం 10 ఉద్యోగాలను కల్పించాలి. దాంతో వారికి పెట్టుబడిదారుల హోదా కింద ఈబీ–5 వీసాను జారీచేస్తారు. ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేయాలంటే గతంలో 5 లక్షల అమెరికన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని నిబంధన ఉండేది. కానీ, ఈ వీసాల కోసం డిమాండ్ పెరుగుతుండడంతో యూఎస్‌సీఐఎస్ ఈ కనీస పెట్టుబడి మొత్తాన్ని 2022లో 8 లక్షల డాలర్లకు పెంచింది.
పెట్టుబడి పెట్టు.. ఈబీ–5 వీసా పట్టు
Published Sun, May 14 2023 5:27 AM | Last Updated on Sun, May 14 2023 5:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment