ఈ వాదనలు మొదలైందెప్పుడో తెలుసా? | Interesting Story On US Presidential Debates | Sakshi
Sakshi News home page

ఈ వాదనలు మొదలైందెప్పుడో తెలుసా?

Published Sun, Oct 11 2020 8:37 AM | Last Updated on Sun, Oct 11 2020 9:50 AM

Interesting Story On US Presidential Debates - Sakshi

ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్యం?... అగ్రరాజ్యం అమెరికా.. అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశం? మన భారతదేశమే.. బాగానే ఉందికానీ.. రెండు దేశాల్లోనూ ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలే కాబట్టి అంతా ఒకటే అనుకుంటున్నారా? కాదండోయ్‌... చాలా తేడాలున్నాయి. మిగిలిన వాటిని కాసేపు పక్కనబెడితే... అమెరికా ఎన్నికల్లో అందరినీ ఆకర్షించే ఘట్టం... ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్‌ లేదా అధ్యక్ష అభ్యర్థుల వాదోపవాదాలు. ఈ చర్చల ఘట్టం మొదలైందెప్పుడు?.. నేపథ్యం ఏంటి?.. ఏ ఏ అంశాలపై చర్చ సాగుతుంది?.. ఇవి కూడా భారతదేశ టెలివిజన్‌  చానెల్‌ చర్చల మాదిరిగానే ఉంటాయా?.. ఆసక్తికరమైన ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం... 

కొన్ని రోజుల క్రితమే.. అమెరికా అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ల మధ్య తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ ముగిసింది. చర్చ హుందాగా జరగలేదని.. అంశాలపై కాకుండా.. వ్యక్తులపై మాట్లాడుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత డొనాల్డ్‌ ట్రంప్‌ కాస్తా కోవిడ్‌ బారిన పడటం.. ఈ పరిస్థితుల్లో ప్రత్యక్షంగా కంటే ఆన్‌లైన్‌  ద్వారా చర్చ మేలని బైడెన్‌ ప్రతిపాదించారు. అయితే దీనికి ట్రంప్‌ నిరాకరించడంతో రెండో చర్చ వాయిదా పడింది. మూడోదఫా వాదోపవాదాలూ డోలాయమానంలో పడిపోయాయి. ఒకవేళ మూడవ చర్చ కూడా జరక్కపోతే.. అలా జరగడం 1976 తరువాత ఇదే మొదటిసారి అవుతుంది. 

అధ్యక్ష చర్చలు ఎప్పుడు మొదలయ్యాయంటే?
1776లో స్వాతంత్య్ర ప్రకటనతోనే మొదలుకాలేదు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలూ రాజ్యాంగాన్ని ఆమోదించిన 1788లోనూ కాదు.  తొలి అధ్యక్షుడు జార్జ్‌ వాషింగ్టన్‌  1789లో పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంలోనూ ఈ చర్చల ప్రక్రియ మొదలు కాలేదు. చాలా లేటుగా.. 1960లోనే మొదలయ్యాయి. అంతకుమునుపు 1858 ప్రాంతంలో అబ్రహాం లింకన్‌ , స్టీఫెన్‌  ఏ డగ్లస్‌ల మధ్య తొలిసారిగా ముఖాముఖి చర్చలు మొదలైనా... వాటికి సంస్థాగత రూపు మాత్రం లభించలేదు. లింకన్‌ , డగ్లస్‌ల మధ్య వరుసగా ఏడుసార్లు చర్చలు జరిగాయి. ప్రక్రియ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. మధ్యవర్తి కూడా లేకుండా అభ్యర్థులు ఇరువురు ముఖాముఖి వాదించుకునేవారు.

ముందుగా ఒక అభ్యర్థి చర్చను ప్రారంభించి గంటసేపు తాను చెప్పదలచుకున్న అంశాలను వివరించేవారు. ప్రత్యర్థి తన వాదనలు వినిపించడంతోపాటు తిప్పికొట్టేందుకు గంటన్నర సమయం లభించేది. తొలుత ప్రసంగించిన అభ్యర్థి తన స్పందనలు తెలియజేసి చర్చను ముగించేవారు.  ఆ తరువాత 1940లో వెండెల్‌ విల్లికీ డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా నామినేట్‌ కాకమునుపే అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌  డి. రూజ్‌వెల్ట్‌ను ముఖాముఖి చర్చకు ఆహ్వానించారు. అయితే రూజ్‌వెల్ట్‌ చర్చ తిరస్కరించారు. 1948, 1956లలోనూ అధ్యక్ష పదవికి నామినేట్‌ కాక మునుపే అంటే ప్రైమరీల అభ్యర్థులుగా థామస్‌ ఈ డీవీ హరాల్డ్‌ స్టాట్సెన్‌ లు, అడ్లాయి స్టీవెన్‌ సన్‌ , ఎస్టేస్‌ కీఫావెర్‌ల మధ్య చర్చలు జరిగాయి. తొలి చర్చ రేడియోలో ప్రసారం కాగా.. మలి చర్చ తొలిసారి టెలివిజన్‌లో ప్రసారమైంది. 

ఓ విద్యార్థి ఆలోచన...
1956లో యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ విద్యార్థి ఫ్రెడ్‌ కాన్‌  అధ్యక్ష పదవికి నామినేట్‌ అయిన ఇరుపార్టీల అభ్యర్థులను చర్చ కోసం ఒక వేదికపైకి తీసుకు వచ్చే ఆలోచన చేశారు. అడ్లాయి స్టీవెన్‌ సన్‌  డెమొక్రటిక్‌ పార్టీ తరఫున, అప్పటి అధ్యక్షుడు రిపబ్లికన్‌  పార్టీ అభ్యర్థి డ్వైట్‌ ఐసన్‌  హోవర్లు తమ యూనివర్సిటీలో చర్చించాలని కాన్‌  ఆహ్వానం పంపారు. ఈ అంశంపై ప్రజల్లో ఆసక్తిని పెంపొందించేందుకు కాన్‌  పలు వార్తా పత్రికలకు, దేశంలోని ప్రముఖులకు లేఖలు రాసి చర్చ కార్యక్రమానికి ఆహ్వానించారు. తొలి లేఖ అందుకున్న మాజీ అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ భార్య ఎలెనార్‌ అందుకు తన సమ్మతిని తెలపడంతోపాటు అడ్లాయి స్టీవెన్‌ సన్‌  ప్రచార కార్యదర్శికీ ఆ లేఖ ప్రతిని పంపారు. అయితే చివరకు ఆ ఏడాది చర్చ జరక్కపోయినా ఈ అంశంపై విస్తృత ప్రచారం మాత్రం సాధ్యమైంది. ఇది కాస్తా.. 1960లో యూనివర్సిటీ వేదికలపై అధ్యక్ష అభ్యర్థుల చర్చలకు పునాది పడింది. అయితే 1964, 68, 72లలో చర్చలు అసలు జరగలేదు. 1976లో గెరాల్డ్‌ ఫోర్డ్, జిమ్మీ కార్టర్ల మధ్య ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ జరగ్గా 1980లోనూ జిమ్మీ కార్టర్‌కు, రొనాల్ల్‌ రీగన్‌కు మధ్య మూడు చర్చలు సాఫీగా జరిగాయి. రీగన్‌  తరఫున జాన్‌  బి. ఆండర్సన్‌  చర్చల్లో పాల్గొనడం విశేషం. అధ్యక్ష అభ్యర్థులతోపాటు ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య కూడా చర్చలు 1984లో మొదలయ్యాయి.  

‘సీపీడీ’ ఏర్పాటు...
అధ్యక్ష అభ్యర్థుల చర్చలకు పూర్తి సంస్థాగత రూపు రేఖలు లభించింది 1987లో. అమెరికన్‌  పౌరులకు తాము ఎన్నుకోబోయే అభ్యర్థుల గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పించే లక్ష్యంతో ‘ద కమిషన్‌  ఆన్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్‌’ (సీపీడీ) ఏర్పాటైంది. లాభాపేక్ష రహిత స్వచ్ఛంద సంస్థగా ఏర్పాటైన సీపీడీ చర్చలకు సంబంధించిన పరిశోధనలు, కార్యకలాపాల నిర్వహణ, అమెరికా అధ్యక్ష అభ్యర్థుల చర్చలకు ప్రాయోజకత్వం వహిస్తుంది. 1988 నుంచి 2020 వరకూ అన్ని ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్‌ సీపీడీ ఆధ్వర్యంలోనే జరిగాయి. చర్చల నాణ్యతను మరింత పెంచేందుకు, ఓటరు చైతన్యానికి కూడా సీపీడీ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అధ్యక్ష అభ్యర్థుల చర్చను చేపట్టేందుకు ఆసక్తి చూపే ఇతర దేశాలకు సాంకేతిక సాయం అందించేందుకూ సీపీడీ ప్రయత్నాలు చేస్తోంది. బోస్నియా, బురుండీ, కొలంబియా, ఘన, హైతీ, లెబనాన్‌ , నైజర్, నైజీరియా, పెరూ, రొమేనియా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, ఉగాండా, ఉక్రెయిన్‌  తదితర దేశాల్లోనూ ఈ చర్చల పద్ధతిని ప్రవేశపెట్టింది.

ముఖ్యమైన విషయాలు..
1. అమెరికాలో టెలివిజన్‌  ప్రత్యక్ష ప్రసారాలు 1928, జూలై 2న ప్రారంభమయ్యాయి. కానీ, అధ్యక్ష ఎన్నికల చర్చలు మొదలైంది మాత్రం 1960లోనే. మసాచూసెట్స్‌ సెనేటర్‌ జాన్‌  ఎఫ్‌ కెనడీ, అప్పటి వైస్‌ ప్రెసిడెంట్‌ రిచర్డ్‌ ఎం.నిక్సన్‌ల మధ్య తొలిసారి టెలివిజన్‌లో చర్చ జరిగింది. చర్చతోపాటు ఎన్నికల్లోనూ కెన్నడీ గెలుపొందారు.  

2. అమెరికన్‌  పౌరులు ప్రతి ముగ్గురిలో ఒకరు అధ్యక్ష అభ్యర్థుల చర్చలపై ఆసక్తి చూపుతారని గణాంకాలు చెబుతున్నాయి. తొలి టెలివిజన్‌  చర్చను 6,64,00,000  మంది ప్రత్యక్షంగా వీక్షించారని అంచనా. అప్పట్లో అమెరికా జనాభా 18.07 కోట్లు మాత్రమే. ప్రస్తుతం అది 32.47 కోట్లు. 

3. 1960 నాటి చర్చల్లో నిక్సన్‌  అనారోగ్యంతోనే పాల్గొన్నారు. స్టేజ్‌పైకి వెళ్లేందుకు తగిన మేకప్‌ చేస్తామన్న అనుచరుల సూచనను నిక్సన్‌  పట్టించుకోలేదు. 1968లో మరోసారి అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన నిక్సన్‌  అప్పటి ఉపాధ్యక్షుడు హ్యూబర్ట్‌ హంఫ్రీతో చర్చ జరిపేందుకు నిరాకరించారు. ఆ ఎన్నికల్లో నిక్సన్‌  రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే.

4. 1960 తర్వాత మూడుసార్లు అధ్యక్ష అభ్యర్థుల చర్చలు జరక్కపోగా.. 1976లో జిమ్మీ కార్టర్, గెరాల్డ్‌ ఫోర్డ్‌ల మధ్య మరోసారి చర్చల సంప్రదాయం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ చర్చలు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. ఇదే ఏడాది తొలిసారి ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య చర్చలు మొదలు కావడం విశేషం.  

5. అధ్యక్ష అభ్యర్థుల చర్చల్లో చేసే నినాదాలు వారి విజయావకాశాలను ప్రభావితం చేస్తూంటాయి,. 1980లో జిమ్మీ కార్టర్‌తో జరిగిన చర్చలో ‘నాలుగేళ్ల క్రితం కంటే ఇప్పుడు మీరు బాగున్నారని అనుకుంటున్నారా?’ అని మాజీ అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ అడిగిన ప్రశ్న అతడికి రెండుసార్లు పదవి దక్కేలా చేసిందని రాజకీయ నిపుణులు చెబుతారు. ఆ తరువాతి ఎన్నికలు ప్రతి ఒక్కదానిలోనూ అభ్యర్థులు కొంచెం అటుఇటుగా అదే అర్థం ధ్వనించే నినాదాలు చేయడం రీగన్‌  ప్రకటన ప్రభావమెంతో చెబుతుంది.  

6. రొనాల్డ్‌ రీగన్‌ , మాజీ ఉపాధ్యక్షుడు వాల్టర్‌ మొండేలేల మధ్య 1984లో జరిగిన చర్చలోనూ.. రీగన్‌  వయో వృద్ధుడని వాల్టర్‌ ప్రస్తావించగా.. ‘ఈ ప్రచారంలో వయసును ఒక అంశంగా చేయదలచుకోలేదు. ప్రత్యర్థి యువకుడు, అనుభవం లేని వాడని నా రాజకీయ అవసరాల కోసం చెప్పను’ అని రీగన్‌  సమాధానమిచ్చి వాల్టర్‌  కూడా నవ్వుకునేలా చేశాడు. 

7. 1992 అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో తొలిసారి చర్చలో ఇద్దరు కాకుండా ముగ్గురు పాల్గొన్నారు. అధ్యక్ష హోదాలో జార్జ్‌ హెచ్‌.డబ్ల్యూ బుష్, అర్కాన్సస్‌ రాష్ట్ర గవర్నర్‌ హోదాలో బిల్‌ క్లింటన్, స్వతంత్ర అభ్యర్థిగా రాస్‌ పెరోట్‌  ఈ చర్చలో పాల్గొన్నారు.  

8. 2012లో బరాక్‌ ఒబామా, మిట్‌ రోమ్నీల మధ్య జరిగిన చర్చ అత్యధిక అమెరికన్లు వీక్షించిన చర్చగా నిపుణులు చెబుతారు. కార్టర్, రీగన్‌  చర్చను 4.58 కోట్ల కుటుంబాలు చూడగా... ఒబామా, రోమ్నీల చర్చను 4.62 కోట్ల కుటుంబాల్లో చూశారని వారు వివరిస్తారు. 2016లో హిల్లరీ, ట్రంప్‌ డిబేట్‌ను 8.4 కోట్ల మంది వీక్షించారు.

9. 2008 నాటి అధ్యక్ష అభ్యర్థుల చర్చలో తొలిసారి యూట్యూబ్, ట్విట్టర్‌ల ద్వారా అమెరికన్‌  పౌరులు నేరుగా అభ్యర్థులను ప్రశ్నలు అడగటం మొదలైంది. 
    2016 నాటి ప్రైమరీ ఎన్నికల్లో ఫేస్‌బుక్‌ ద్వారా అభ్యర్థులపై ప్రశ్నలు సంధించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement