వందలాది బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్ల ప్రయోగం
టెల్ అవీవ్,జెరూసలేంల్లో ధ్వంసం
విమానాశ్రయాల మూత, సైరన్ మోతలు
జనం కకావికలు,బంకర్ల దిశగా రుగులు
హనియా,నస్రల్లా మృతికి తీకారం: ఇరాన్
ఇది ఆరంభం మాత్రమేనని ప్రకటన
జోర్డాన్ రాజధాని అమ్మాన్‌పైకీ మిసైళ్లు భారీ మూల్యం తప్పదన్న అమెరికా
ఇజ్రాయెల్‌కు దన్నుగా నిలుస్తాం: బైడెన్
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భూతల దాడులు
పూర్తిస్థాయి యుద్ధం దిశగా పరిణామాలు
జెరుసలేం/టెహ్రాన్/వాషింగ్టన్: మధ్యప్రాచ్యం అగ్నిగుండమైంది. దాడులు, ప్రతి దాడులు, ప్రతీకార దాడులతో భగ్గుమంటోంది. లెబనాన్‌ను కొద్ది రోజులుగా వైమానిక దాడులతో బెంబేలెత్తిస్తున్న ఇజ్రాయెల్ మంగళవారం భూతల దాడులను తీవ్రతరం చేసింది. లెబనాన్‌కు దన్నుగా నిలుస్తున్న ఇరాన్ కూడా కాసేపటికే ప్రతీకారేచ్ఛతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. అమెరికా నిఘా విభాగం హెచ్చరికలను నిజం చేస్తూ మంగళవారం రాత్రి పెద్దపెట్టున వైమానిక దాడులకు దిగింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా భారీ సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది.
నిమిషాల వ్యవధిలో వందలాది మిసైళ్లు, రాకెట్లు దూసుకొచ్చాయి. టెల్ అవీవ్‌తో పాటు సమీపంలోని జెరుసలేం తదితర ప్రాంతాలు భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఇరాన్‌కు దన్నుగా హెజ్‌బొల్లా కూడా టెల్ అవీవ్‌పైకి మిసైళ్లు ప్రయోగించింది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా విమానాశ్రయాలన్నింటినీ మూసేసింది. ప్రజలందరినీ అప్రమత్తం చేసింది. బంకర్ సైరన్లు నిరంతరాయంగా మోగాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం బంకర్లు, సురక్షిత ప్రాంతాలకేసి పరుగులు తీశారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్‌పైకి కూడా మిసైళ్లు దూసుకెళ్లి కలకలం రేపాయి.
రంగంలోకి అమెరికా యుద్ధనౌకలు
ఇరాన్ దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. స్వీయరక్షణ చేసుకునేందుకు ఇజ్రాయెల్‌కు అన్నివిధాలా అండగా నిలుస్తామని ప్రకటించారు. ఇరాన్ మిసైళ్లను నేలకూల్చడంలో ఇజ్రాయెల్‌కు సహకరించాల్సిందిగా సైన్యాన్ని ఆదేశించారు. దాంతో మధ్యదరా సముద్రంలోని అమెరికా యుద్ధనౌకలు కూడా రంగంలోకి దిగి పలు ఇరాన్ క్షిపణులను అడ్డుకుని కూల్చేశాయి. ఇరాన్ దాడులకు తెగబడితే ఇజ్రాయెల్‌కు దన్నుగా రంగంలోకి దిగాల్సి వస్తుందని అమెరికా ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. మధ్యప్రాచ్యంలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఆ దిశగా రంగంలోకి దిగే సూచనలు కని్పస్తున్నాయి.
ఇరాన్ తాజా దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. మధ్యప్రాచ్యంలో తాము చేరలేని చోటంటూ ఏదీ లేదని పునరుద్ఘాటించారు. మొత్తానికి హమాస్‌ను ఏరివేసేందుకు గాజాపై ఏడాది క్రితం ఇజ్రాయెల్ తెరతీసిన దాడులు చివరికి లెబనాన్, ఇరాన్‌తో పూర్తిస్థాయి యుద్ధం దిశగా దారి తీసేలా కన్పిస్తున్నాయి. ఈ పరిణామంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. గత ఏప్రిల్లో కూడా ఇజ్రాయెల్‌పై ఇరాన్ అనూహ్యంగా దాడికి దిగడం తెలిసిందే. అయితే అది ప్రయోగించిన క్షిపణులన్నింటినీ ఇజ్రాయెల్ మధ్యలోనే అడ్డుకుంది.
ప్రతిదాడులకు దిగారో...: ఇరాన్
ఇజ్రాయెల్‌పైకి భారీగా మిసైళ్లు ప్రయోగించినట్టు ఇరాన్ సైన్యం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ)’ ప్రకటించింది. ‘‘గత జూలైలో హమాస్ అగ్ర నేత ఇస్మాయిల్ హనియాను, తాజాగా హెజ్»ొల్లా చీఫ్ నస్రల్లాను, తమ జనరల్ అబ్బాస్ నిల్ఫొరుషన్‌ను హతమార్చినందుకు, అసంఖ్యాకులైన అమాయక లెబనీస్, పాలస్తీనా ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నందుకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాం’’ అని పేర్కొంది.
‘‘ఇది ఆరంభం మాత్రమే. మాపై ప్రతి దాడులకు దిగితే మరింత భారీగా విరుచుకుపడతాం’’ అని హెచ్చరించింది. ఇజ్రాయెల్ సైన్యం కూడా ఇరాన్ దాడులను ధ్రువీకరించింది. వాటిని అడ్డుకునేందుకు భారీగా ఇంటర్‌సెప్టర్ మిసైళ్లు ప్రయోగించింది. ఇరాన్ దాడులు విస్తరించవచ్చని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగరీ అభిప్రాయపడ్డారు. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిందని ప్రకటించారు. ఇరాన్ దాడులు ఆగాయని. ప్రస్తుతానికి ముప్పు లేనట్టేనని పేర్కొన్నారు.
హెచ్చరించి మరీ లెబనాన్‌లోకి...
ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దు ప్రాంతాలు కూడా బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. హెజ్»ొల్లా మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం సోమవారం అర్ధరాత్రి నుంచే లెబనాన్‌లోకి చొచ్చుకుపోవడం మొదలుపెట్టింది. సరిహద్దు గ్రామాల్లోని లెబనాన్ ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలాలని ముందుగానే హెచ్చరించి మరీ రంగంలోకి దిగింది. దక్షిణ సరిహద్దుకు, లితానీ నదికి మధ్యన 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో ఉన్నవారంతా తక్షణం ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం ఇజ్రాయెల్ దళాలు భారీ సంఖ్యలో సరిహద్దు దాటి కిలోమీటర్ల కొద్దీ చొచ్చుకెళ్లాయి. లెబనాన్‌పై లక్షిత భూతల దాడులు మొదలైనట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
‘‘అక్కడి హెజ్»ొల్లా స్థావరాలను లక్ష్యం చేసుకున్నాం. మిలిటెంట్లు భారీగా ఆయుధాలను దాచిన బంకర్లు, టన్నెళ్లు తదితరాలను స్వా«దీనం చేసుకున్నాం’’ అంటూ వీడియోలు విడుదల చేసింది. ఇరు పక్షాల మధ్య భారీగా కాల్పులు, రాకెట్ దాడులు జరుగుతున్నాయి. ఒక రాకెట్ బీరూట్‌లో ఇరాన్ దౌత్య కార్యాలయానికి అతి సమీపంలో పడింది. దాంతో పలు భవనాలు కుప్పకూలాయి. ఎర్రసముద్రంలోని హొడైడా నగరానికి 110 కిలోమీటర్ల దూరంలో మంగళవారం ఉదయం వేళ ఇజ్రాయెల్ తొలి దాడి జరిగినట్టు తెలుస్తోంది.
తర్వాత కాసేపటికే అక్కడి ఉత్తర దిశగా రెండో దాడి జరిగిందని బ్రిటన్ సముద్ర వర్తక కార్యకలాపాల కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో లెబనాన్‌లోని అతి పెద్ద శరణార్థుల శిబిరాల్లో ఒకటైన సిడాన్‌లోని ఎన్ ఆల్ హిల్వే శిబిరంపై జరిగిన బాంబు దాడిలో ఆరుగురి దాక మరణించినట్టు చెబుతున్నారు. వీరిలో పాలస్తీనా ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్బాస్‌కు చెందిన ఫతా గ్రూప్ సారథి జనరల్ మునీర్ మగ్దా కొడుకు, కోడలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఉగ్ర కాల్పుల్లో ఆరుగురి మృతి
యుద్ధజ్వాలల నడుమ ఇజ్రాయెల్‌లో భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. జెరూసలేంలో ఇద్దరు ఉగ్రవాదులు విచ్చలవిడి కాల్పులకు తెగబడ్డారు. దాంతో ఆరుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగి ముష్కరులిద్దరినీ మట్టుబెట్టారు.
లెబనాన్‌లో 900 మంది భారత సైనికులు!
లెబనాన్ దక్షిణ సరిహద్దుల వద్ద ఐరాస శాంతి పరిరక్షక దళంలో 900 మంది దాకా భారత సైనికులున్నట్టు తెలుస్తోంది. అక్కడ యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో వారి భద్రతపై ఆందోళలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఐరాస దళంలో భాగంగా ఉన్న దృష్ట్యా వారిని ఇప్పటికిప్పుడు వెనక్కు పిలవడం సరైన చర్య కాబోదని కేంద్రం అభిప్రాయపడుతోంది. ‘‘మన సైనికులంతా సురక్షితంగా ఉన్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం’’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment