దక్షిణ గాజాలోని కీలకమైన రఫా నగరంలో దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. ఆ దిశగా తమ సైన్యం హమాస్ బలగాలను అంతం చేయటమే లక్ష్యంగా ముందుకు కదులుతోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా గాజాలో మానవత సాయం అందించాలని ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా ఇజ్రాయెల్ మాత్రం పట్టువిడవకుండా తమ సైన్యాన్ని కీలకమైన రఫా నగరంలో దాడుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఏ సమయంలో దాడులను ఉధృతం చేస్తారనే కచ్చితమైన సమాచారాన్ని మాత్రం ఇజ్రాయెల్ ఇంకా వెల్లడించలేదు.
సుమారు 40,000 మిలిటరీ టెంట్లలను ఇజ్రాయెల్ సైన్యం సిద్ధం చేసుకుంది. ఒక్కో టెంట్‌లో సుమారు 10 నుంచి 12 మంది సైనికులు ఉంటారని ఓ ఆర్మీ ఉన్నతాధికారి తెలిపారు. ఈ టెంట్లను రఫా నగరానికి సుమారు ఐదు కిలో మీటర్ల దూరంలో ఏర్పాటు చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రఫా నగరం ఈజిప్టు సరిహద్దును ఆనుకొని ఉంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య చెలరేగిన యుద్ధ ప్రారంభం నుంచి గాజా వదిలి వెళ్లిన మిలియన్ పాలస్తీనియన్ల అక్కడ ఆశ్రయం పొందుతున్నారు.
మరోవైపు.. రఫా నగరంపై దాడి విషయంలో ఈజిప్ట్ ఇజ్రాయెల్‌ను తీవ్రంగా హెచ్చరించింది. రఫా నగరంలో ఎటువంటి దాడులు చేసి.. అక్కడి పౌరుల పరిస్థితులు, ప్రాతీయ శాంతి, భద్రతకు దాడుల ద్వారా భంగం కలిగిస్తే.. ఇజ్రాయెల్ విపత్కర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్‌సీసీ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈజిప్ట్ హెచ్చరికలను సైతం పక్కన పెట్టిన ఇజ్రాయెల్ రఫాలో దాడులు కొనసాగుతాయని, తమ సైన్యం కూడా ముందుకు కదులుతోందని పేర్కొంది. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాలు రాఫా నగరంపై దాడిని నివారించడానికి కాల్పుల విరమణ పొడగింపునకు మధ్యవర్తిత్వం వహించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో దాదాపు 34 వేల మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment