ఫీనిక్స్‌లో ట్రంప్ మద్దతుదారుల ర్యాలీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. దేశాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారని స్పష్టంగా తెలిసేందుకు మరికొంత సమయం పట్టనుంది. అయితే, మేజిక్ మార్క్ 270కి అత్యంత చేరువలోకి వచ్చిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం లాంఛనమేనని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. మరోవైపు, కౌంటింగ్ కొనసాగుతున్న పలు కీలక రాష్ట్రాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నందున తుది ఫలితం తమకే అనుకూలంగా వస్తుందని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బృందం ఆశాభావంతో ఉంది.
ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం 264 ఎలక్టోరల్ ఓట్లతో అధ్యక్ష పీఠానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అడుగు దూరంలో నిలిచారు. మేజిక్ మార్క్ 270 కి ఆయన కేవలం ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. ముఖ్యమైన విస్కాన్సిన్, మిషిగాన్ రాష్ట్రాల్లో విజయం సాధించడం బైడెన్‌కు అనుకూలించింది. మరోవైపు, ట్రంప్ కేవలం 214 ఎలక్టోరల్ ఓట్లతో ఫినిషింగ్ లైన్‌కు చాలా దూరంలో ఉన్నారు. కానీ, ఫలితాలు వెలువడాల్సిన రాష్ట్రాలు తన ఖాతాలోనే పడుతాయని, దాంతో విజయం తనకే దక్కుతుందని ట్రంప్ నమ్మకంతో ఉన్నారు.
జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరొలినా, నెవడా, అలస్కాల్లో ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. 11 అరిజోనా ఎలక్టోరల్ ఓట్లు ఉన్న అరిజోనా ఫలితాన్ని పలు మీడియా సంస్థలు ఇంకా నిర్ధారించలేదు. ‘సీఎన్‌ఎన్’ సంస్థ అరిజోనాను మినహాయించి బైడెన్ సాధించిన ఎలక్టోరల్ ఓట్లు 255 అని పేర్కొంది. అరిజోనాలో కౌంటింగ్ ముగియలేదని, 86% కౌంటింగ్ అనంతరం, బైడెన్ 68 వేల మెజారిటీతో ఉన్నారని పేర్కొంది. కానీ, మెజారిటీ మీడియా సంస్థలు మాత్రం అరిజోనాను బైడెన్ ఖాతాలో వేసి, ఆయన గెల్చుకున్న ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 264 అని పేర్కొన్నాయి.
పెన్సిల్వేనియా.. జార్జియాలో..
20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో 91% ఓట్ల కౌంటింగ్ పూర్తయిన తరువాత ట్రంప్ 1,35,671 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఇక్కడ 71% పోస్టల్ ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. ఇంకా, 7.63 లక్షల ఓట్లను లెక్కించాల్సి ఉంది. అలాగే, నార్త్ కరోలినాలో 95% కౌంటింగ్ ముగిసిన తరువాత ట్రంప్‌నకు 77,337 ఓట్ల మెజారిటీ ఉంది. ఇక్కడ ఉన్న ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 15. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న జార్జియాలో 96% కౌంటింగ్ అనంతరం ట్రంప్ మెజారిటీ 18,586కి తగ్గింది. ఇక్కడ ఇంకా 90, 735 ఓట్లను లెక్కించాల్సి ఉంది.
6 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న నెవడాలో 86% కౌంటింగ్ తరువాత బైడెన్ 8వేల స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు. తాను ఆధిక్యతలో ఉన్న రాష్ట్రాలతో పాటు, బైడెన్ ఆధిక్యతలో ఉన్నవాటిలో ఒక్క రాష్ట్రాన్నైనా చేజిక్కించుకుంటే.. ట్రంప్‌నకు విజయం సాధ్యమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయం దక్కని పక్షంలో.. కోర్టులో తన పోరాటాన్ని కొనసాగించాలని ట్రంప్ నిర్ణయించారు. అందులో భాగంగానే, ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని కోర్టుల్లో ఆయన కేసులు వేశారు. కౌంటింగ్‌ను నిలిపేసేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టులను అభ్యర్థించారు. ఈ దిశగా సుప్రీంకోర్టులోనూ ఆయన కేసు వేశారు. పోరాటం ఇంకా ముగియలేదని, తాము రేసులోనే ఉన్నామని రిపబ్లికన్ పార్టీ నేషనల్ కమిటీ అధ్యక్షురాలు రొన్నా మెక్‌డేనియల్ చెప్పారు.
‘ఈ వారాంతానికి ఈ దేశానికి అధ్యక్షుడుగా మరో నాలుగేళ్లు ట్రంపే ఉంటారని స్పష్టమవుతుంది’ అని ట్రంప్ ప్రచార బృందంలోని జేసన్ మిల్లర్ వ్యాఖ్యానించారు. ‘కౌంటింగ్ మొత్తం ముగిసి, పూర్తి ఫలితాలు వెలువడిన తరువాతనే నేను విజేతగా భావిస్తాను. అమెరికా అధ్యక్షుడిగా నిష్పక్షపాతంగా నేను వ్యవహరిస్తాను’ అని బుధవారం బైడెన్ వ్యాఖ్యానించారు. విస్కాన్సిన్‌లో ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన ఓట్లలో తేడా 1 శాతం లోపే ఉంది. అందువల్ల రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసే చట్టబద్ధ అవకాశం ట్రంప్‌నకు ఉంది. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించే అవకాశం తమకు ఇవ్వలేదని ఆరోపిస్తూ.. మిషిగన్‌లో కౌంటింగ్ నిలిపేయాలని ట్రంప్ ప్రచార బృందం స్థానిక కోర్టులో కేసు వేసింది.
కోర్టులో తొలి విజయం
ఎన్నికల వివాదాల్లో ట్రంప్ తొలి విజయం సాధించారు. ‘పరిశీలకులను ఆరు అడుగుల లోపు నుంచి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు అనుమతించాలి’ అని పెన్సిల్వేనియాలోని కామన్వెల్త్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ తీర్పు వచ్చిన వెంటనే.. ‘పెన్సిల్వేనియాలో న్యాయపరంగా భారీ విజయం’ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌ను కూడా పరిశీలిస్తామని పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రచార మేనేజర్ స్టెపిన్ తెలిపారు.
షికాగోలో బైడెన్ మద్దతుదారుల నిరసన
Comments
Please login to add a commentAdd a comment