సీఐఏ.. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన నిఘా సంస్థ. అలాంటి ఏజెన్సీకి డైరెక్టర్ రేసులో.. ఓ భారతీయ మూలాలున్న వ్యక్తిని నియమించవచ్చనే ప్రచారం హాట్ టాపిక్ అయ్యింది. అయితే తృటిలో ఆ అవకాశం చేజార్చుకున్నారు కశ్యప్ పటేల్ అలియాస్ కాష్. అలాగని ట్రంప్ ఆయన్ని వదులుకోలేదు. ఇప్పుడు మరో కీలకమైన విభాగానికి కాష్ పటేల్‌ను డైరెక్టర్‌గా నియమించబోతున్నారు.
జనవరి 20వ తేదీ తర్వాత ప్రస్తుతం ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఉన్న క్రిస్టోఫర్ వ్రేను.. ట్రంప్ తప్పిస్తారని, ఆ స్థానంలో 44 ఏళ్ల వయసున్న కాష్ పటేల్‌ను కూర్చోబెడతారని వైట్‌హౌజ్ మాజీ అధికారి స్టీవ్ బానోన్ ప్రకటించారు. అయితే వ్రేను 2017లో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించింది ట్రంపే. పదేళ్ల కాలపరిమితితో ఆయన్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. అయితే.. తర్వాతి కాలంలో ట్రంపే ఆయనపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. రాజకీయాల్లో వ్రే జోక్యం ఎక్కువైందని మండిపడుతూ వచ్చారు. అంతేకాదు.. ఈ ఏడాది జులైలో వ్రేను రాజీనామా చేయాల్సిందేనని ట్రంప్ గట్టిగా డిమాండ్ చేశారు కూడా. అయితే వ్రే మాత్రం తాను ఎఫ్‌బీఐలో పూర్తి కాలం కొనసాగుతానని చెబుతూ వచ్చారు.
ఎవరీ కాష్ పటేల్
ట్రంప్‌కు వీరవిధేయుడిగా కాష్ పటేల్‌కు పేరుంది. ఈయన కుటుంబమూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. ఈయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. అతడి తండ్రి, ఉగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు.
న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీ 1980లో కశ్యప్ పుట్టాడు. కాష్ పటేల్ పూర్తి పేరు.. కశ్యప్ ప్రమోష్ వినోద్ పటేల్. యూనివర్శిటీ ఆఫ్ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ లా సంస్థలో పని చేయాలనుకున్నా.. కొలువు లభించలేదు. దీంతో అతడు మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు.
కాష్ పటేల్‌ను ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసేందుకు నియమించారు. దీంతో ఆయన 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తులో సాయం చేశారు. రక్షణ విషయంలో ట్రంప్ ప్రాధాన్యాలు కశ్యప్‌కు బాగా తెలుసు. ఐసిస్ నాయకుడు అల్ బాగ్దాదీ, అల్-ఖైదా హెడ్ అల్ రిమి వంటి ఆపరేషన్లకు సంబంధించి పనిచేశారు. అంతేకాదు పలుచోట్ల బందీలుగా ఉన్న అమెరికన్లను సురక్షితంగా దేశానికి రప్పించడంలో అతడి పాత్ర ఉంది. జస్టిస్ డిపార్ట్‌మెంట్‌లో స్పెషల్ ఆపరేషన్ కమాండ్‌లో లైజనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు కూడా. ట్రంప్ రహస్య పత్రాల వ్యవహారం విచారణ సమయంలోనూ ఈయన పేరు ప్రముఖంగానే వినిపించింది. అయితే..
ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాక.. సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి కొత్త చీఫ్ ఎవరవుతారనే చర్చ నడిచింది. ఆ సమయంలో రేసులో కాష్ పటేల్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే అమెరికా మాజీ గూఢచారి జాన్ రాట్‌క్లిఫ్ ఆ అవకాశం దక్కించుకున్నారు.
వ్యక్తిగత జీవితం
కాష్ పటేల్ ప్రస్తుతం కొలంబియాలో నివసిస్తున్నారు. ఐస్ హాకీ అంటే ఆయన మక్కువ ఎక్కువ. ఆయన వైవాహిక జీవితానికి సంబంధించిన ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.
Comments
Please login to add a commentAdd a comment