స్పీకర్‌నే దించేసుకున్నారు! | Kevin McCarthy ousted as House Speaker in historic vote | Sakshi
Sakshi News home page

స్పీకర్‌నే దించేసుకున్నారు!

Published Thu, Oct 5 2023 5:06 AM | Last Updated on Thu, Oct 5 2023 5:06 AM

Kevin McCarthy ousted as House Speaker in historic vote - Sakshi

వాషింగ్టన్‌:  అమెరికాలో విపక్ష రిపబ్లికన్‌ పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది. ప్రతినిధుల సభ స్పీకర్‌ పదవి నుంచి రిపబ్లికన్‌ నేత కెవిన్‌ మెకార్తీని సొంత పారీ్టకి చెందిన సభ్యులే సాగనంపారు! అగ్రరాజ్య చరిత్రలో స్పీకర్‌ ఇలా ఉద్వాసనకు గురవడం ఇదే తొలిసారి. ఆయనపై రిపబ్లికన్‌ నేత మాట్‌ గేట్జ్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఆ పారీ్టకి చెందిన మరో ఏడుగురు కాంగ్రెస్‌ సభ్యులు మద్దతివడం ద్వారా అధికార డెమొక్రటిక్‌ పారీ్టతో చేతులు కలిపారు.

దాంతో మంగళవారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) జరిగిన ఓటింగ్‌లో 216–210 ఓట్లతో మెకార్తీ ఓటమి చవిచూశారు. ఈ ఏడాది జనవరిలో ఏకంగా నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన 15 రౌండ్ల ఓటింగ్‌ అనంతరం మెకార్తీ స్పీకర్‌గా నెగ్గడం తెలిసిందే. పది నెలలు తిరక్కుండానే ఆయన ఇలా అవమానకరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిక తదుపరి స్పీకర్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

కొంప ముంచిన షట్‌డౌన్‌
కెవిన్‌ పారీ్టలో అందరి నమ్మకమూ కోల్పోయారని గేట్జ్‌ ఆరోపించారు. సైద్ధాంతికంగా తనతో అన్ని విషయాల్లోనూ విభేదించే తమ పార్టీ సభ్యులు కూడా ఆయన్ను దించేసే విషయంలో కలసి రావడమే ఇందుకు రుజువని చెప్పారు. ఆర్థిక షట్‌డౌన్‌ను తాత్కాలికంగా నివారించే సాకుతో అధికార పారీ్టతో కెవిన్‌ చేతులు కలిపారన్నది గేట్జ్‌ వర్గం ఆరోపణ. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించింది. స్పీకర్‌కు ఉద్వాసనను కనీవినీ ఎరగని ఘటనగా డెమొక్రటిక్‌ పార్టీ కాంగ్రెస్‌ సభ్యుడు, ఇండియన్‌ అమెరికన్‌ అమీ బెరా అభివరి్ణంచారు. రిపబ్లికన్ల మధ్య నెలకొన్న పరస్పర అపనమ్మకానికి ఇది తాజా నిదర్శనమన్నారు.

రిపబ్లికన్ల ఇంటిపోరు వల్లే...  
గేట్జ్‌ సారథ్యంలోని రైట్‌ వింగ్‌ రిపబ్లికన్‌ సభ్యులకు నిజానికి కెవిన్‌ మీద ఆది నుంచీ వ్యతిరేకతే! జనవరిలో స్పీకర్‌గా ఆయన ఎన్నిక కావడాన్ని వారు చివరిదాకా వ్యతిరేకించారు. దాంతో తనను తొలగించాలని ఒక్క రిపబ్లికన్‌ సభ్యుడు కోరినా దానిపై ఓటింగ్‌కు అనుమతిస్తానని వారితో ఒప్పందం చేసుకుని మెకార్తీ స్పీకర్‌గా నెగ్గారు. చివరికి అదే ఒప్పందం కారణంగా పదవిని కోల్పోయారు! అయితే సొంత పారీ్టలోనే ఇప్పుడు కెవిన్‌ ఉద్వాసనను తీవ్రంగా తప్పుబడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. గేట్జ్‌ చర్య ద్రోహపూరితమని వారు ఆరోపిస్తున్నారు. వారిమీద కఠిన చర్యలకు డిమాండ్‌ చేస్తుండటంతో రిపబ్లికన్‌ పారీ్టలో సంక్షోభం కాస్తా రసకందాయంలో పడింది!

 ఇప్పుడేంటి?
► తదుపరి స్పీకర్‌ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
► అమెరికా కాంగ్రెస్‌లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్లకే మెజారిటీ దక్కడం తెలిసిందే.
► గత జనవరిలో జరిగిన ఓటింగ్‌లో గెట్జ్‌ సారథ్యంలోని రైట్‌ వింగ్‌ వ్యతిరేకులను బుజ్జగించి మెకార్తీ కనాకష్టంగా స్పీకర్‌ అయ్యారు.
► అక్టోబర్‌ 11న కొత్త స్పీకర్‌ ఎన్నిక జరగాల్సి ఉంది.
► తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోసారి పోటీకి మెకార్తీ ససేమిరా అంటున్నారు.
► రిపబ్లికన్లలో ఇంటి పోరు తీవ్రంగా సాగుతుండటంతో స్పీకర్‌ అభ్యరి్థపై ఏకాభిప్రాయం కష్టంగానే కనిపిస్తోంది.
► ప్రస్తుతానికి రిపబ్లికన్‌ నేతలు స్టీవ్‌ స్కలైస్‌ (లూసియానా), టామ్‌ ఎమ్మర్‌ (మిన్నెసోటా) పేర్లు వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement