వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని ఖలిస్తానీ ఉగ్రవాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 24న మోదీ అగ్రరాజ్యానికి వెళ్తున్న సందర్భంగా ఆ సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతో పాటు వైట్ హౌస్ వెలుపల కూడా నిరసన కార్యక్రమాలు చేసేందుకు ఆ సంస్థ ప్లాన్ చేస్తోంది.
ఎందుకంటే తొలిసారి ప్రత్యక్ష క్వాడ్ సమావేశంతోపాటు ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పాల్గొనడానికి మోదీ అమెరికాకు వెళ్తున్నారు. కాగా భారత్‌లో రైతులపై హింసకు వ్యతిరేకంగా తాము ఈ నిరసనలు చేపట్టనున్నట్లు ఎస్ఎఫ్‌జే సంస్థ పేర్కొంది. ఆ గ్రూపు జనరల్ కౌన్సిల్ గుర్పత్‌వంత్ సింగ్ పన్నన్ మాట్లాడుతూ .. అమెరికాలో మోదీకి నిద్రలేని రాత్రులను గడిపేలా చేస్తామని తెలపడం గమనార్హం. వీటితో పాటు పన్నన్.. యూకే, యూఎస్, యూరోపియన్ యూనియన్ దేశాలు తాలిబాన్లను గుర్తిస్తే, ఎస్‌ఎఫ్‌జే కూడా ఖలిస్తాన్ మద్దతు కోసం తాలిబాన్లను సంప్రదిస్తామని పేర్కొన్నాడు.
లండన్‌లో ఆగస్ట్ 15న ఖలిస్థాన్ రెఫరెండమ్ జరుగుతుందని గతేడాది ఈ గ్రూపు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత కొవిడ్ కారణంగా అక్టోబర్‌కు వాయిదా వేశారు. ఎస్‌ఎఫ్‌జే సమస్యపై చర్చించడానికి ఇంటెలిజెన్స్ అధికారులు ఇటీవల ఢిల్లీలో పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినట్లు ఉన్నత వర్గాల సమాచారం. ముఖ్యంగా ఈ నిషేధిత సంస్థ పంజాబ్ యువతను విద్రోహ కార్యకలాపాలను ప్రేరేపించడం కోసం ప్రయత్నిస్తోంది. ఎస్‌ఎఫ్‌జే గ్రూప్ తమ ప్రచారం కోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసింది. అందులో పాకిస్థాన్, ఐఎస్ఐ ఏజెంట్ల నంబర్లు కూడా ఉన్నాయి. అయితే చట్టానికి వ్యతిరేకంగా వారి కార్యకలాపాలు ఉన్నాయని భారత ప్రభుత్వం ఈ గ్రూపును జులై 10, 2019న నిషేధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment