మర్యాదగా ఉండకపోతే.. స్వదేశానికి పార్సిల్ చేస్తారు
చిన్న కేసు నమోదైనా సీన్ సితార్..
మనలో పాపం చేయని వాడు... ఎవడో చెప్పండి.. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి.. అంటూ 1976లో సి. నారాయణరెడ్డి రాసిన పాటను ఎవరైనా ట్రంప్ కు వినిపిస్తే బాగుణ్ణు. పోనీ పాట పాడడం రాకపోతే అప్పట్లో సోక్రటీస్ చెప్పిన మాటను అయినా అమెరికా అధ్యక్షుడికి ఆయనకు వినిపించండి. సోక్రటీస్ ఏమన్నారా... ఆనాటి సమాజంలో పెద్ద నేరంగా పరిగణించబడిన తప్పిదానికి పాల్పడిన ఓ మహిళను రాళ్లతో కొట్టి చంపాలని ఆనాటి గ్రీకు రాజు తీర్పు ఇచ్చారు.
ఆమె ప్రాణభయంతో పరుగుపరుగున సోక్రటీస్ వద్దకు వచ్చిందట.. ఆమెను వదిలిపెట్టి తమకు అప్పగిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తామని గ్రామస్తులు సోక్రటీసును కోరారట. అయితే అప్పుడు సోక్రటీస్.. అలాగే .. మీరన్నట్లుగానే ఆమెను మీకు అప్పగిస్తాను.. అయితే 'మీలో ఏనాడూ.. చిన్న పొరపాటు.. తప్పిదం.. ఏ పాపం చేయని వాళ్ళు మొదటి రాయి విసరండి. దీనికి మీ అంతరాత్మే రుజువు' అని కండిషన్ పెట్టారట. దీంతో వచ్చినవాళ్లలో ఎవరూ ఒక్క రాయి కూడా విసరాలేకపోయారట.. వచ్చినవాళ్లంతా ఏదోనాడు చిన్నదో పెద్దదో తప్పు చేశారట.. అందుకే అందరూ రాళ్లు అక్కడ పడేసి వెళ్లిపోయారట ఈ ఎపిసోడ్ కూడా ట్రంప్ కు చెప్పాలి .. ఎందుకంటే
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి పూటపూటకూ కొత్త చట్టాలు.. నిబంధనలు తీసుకొస్తూ.. అమెరికాలో నివసిస్తున్న వలసజీవులకు నిద్రలేకుండా చేస్తున్నారు. గ్రీన్ కార్డు ఉన్నంతమాత్రాన అమెరికా పౌరులు అయిపోలేరు అంటూ టీజర్ రిలీజ్ చేసిన ట్రంప్ ఇప్పుడు ఇంకో టీజర్ సిద్ధం చేసారు. వలసదారులపాలిట సింహస్వప్నంలాంటి లేకెన్ రిలే చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని.. ఇక అమెరికాలో చిన్నపాటి నేరాలను సైతం తీవ్రంగా పరిగణించి అమెరికా నుంచి స్వదేశానికి పంపేస్తారన్నమాట.
చిన్న నేరానికి కూడా వెలివేస్తారా?
అమెరికాలో 2022లో లేకెన్ రిలే అనే అమెరికా అమ్మాయిని వెనిజులా నుంచి వచ్చిన ఒక వలసదారుడు హత్య చేసాడు. వాస్తవానికి ఆ హత్య చేసిన అంటొనియా ఇబర్రా అనేవ్యక్తి మీద గతంలో కూడా కేసు నమోదైంది. కానీ అరెస్ట్ చేయలేదు. అప్పుడే వాణ్ని జైల్లో పడేసి ఉంటె ఈ లేకెన్ రిలే హత్యకు గురయ్యేది కాదు కదా.. వలసదారులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉండడం వాళ్ళ స్థానిక అమెరికన్లకు భద్రతా లేకుండా పోతోంది. ఇమ్మిగ్రేషన్ చట్టాల్లోని లొసుగులు.. కొన్నికొన్ని మినహాయింపులు ఇలా వలసదారులకు వరంగా మారుతున్నాయి అనే వాదన మొదలైంది.
ఇదీ చదవండి: చట్టసభల్లో ట్రంప్ తొలి విజయం.. లేకెన్ రిలే చట్టం గురించి తెలుసా?
దీంతో ఆమె పేరిట ఒక చట్టాన్ని తీసుకురాగా దానికి ట్రంప్ మద్దతుపలుకుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ చట్టం కింద ఎవరైనా విదేశీయుడు అమెరికాలో బుద్దిగా ఉండకుండా విచ్చలవిడిగా ఉంటె వెంటనే అరెస్ట్ చేస్తారు.. అంతేకాకుండా వాళ్ళను వెనువెంటనే వారి స్వదేశానికి తరిమేస్తారన్నమాట. ఇది అమెరికా వెళ్లి చదువుకుంటున్న.. ఉద్యోగం చేస్తున్న లక్షలాదిమంది భారతీయులతోబాటు పలు విదేశీయులకూ ప్రమాదంగా మారుతోంది.
చిన్న చిన్న తప్పులు చేసి అరెస్ట్ అయినంతమాత్రాన అమెరికాలో చదువుకుంటున్న.. జాబ్ చేస్తున్నవాళ్లను వెనువెంటనే వారి స్వదేశానికి పంపేయడం ఏమిటన్న వాదన మొదలైంది. యువత.. విద్యార్థులు తెలిసో.. తెలియకో.. ఏదో చిన్న చిన్న నేరాలు చేసినంతమాత్రాన మొత్తం దేశబహిష్కరణ చేసేసి వారి ఆశలను చిదిమేస్తారా.. అవసరం ఐతే కేసు పెట్టి.. విచారించి శిక్ష వేయాలి కానీ ఇలా ఏకంగా వారి భవిష్యత్తును నాశనం చేస్తారా అనే అభిప్రాయాలు వినవస్తున్నాయి.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment