సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ప్రతిసారీ భూమికి మరింత దగ్గరగా వస్తూ భయపెడుతున్న అపోఫిస్.. ఈ నెల 5, 6 తేదీల్లో భూమికి సమీపంగా దూసుకు వెళ్లనుంది. కచ్చితంగా చెప్పాలంటే.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బాగా దగ్గరగా ప్రయాణిస్తుంది. మళ్లీ 2029లో, 2068లో భూమికి చాలా సమీపంలోకి వస్తుంది. ఆ టైంలో చంద్రుడిలా మెరిసిపోతూ ఆకాశంలో ప్రయాణించడాన్ని మనం చూడొచ్చు కూడా..
ఇలా దగ్గరగా దూసుకెళ్తున్న నేపథ్యంలో అపోఫిస్‌ను మరింత క్షుణ్నంగా పరిశీలించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఆస్టరాయిడ్ వెళ్లే మార్గాన్ని, స్పీడ్‌ను, అది ప్రయాణించే టప్పుడు ఉండే పరిస్థితులు, దాని మీద భూమి ఆకర్షణ శక్తి ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేయడం ద్వారా.. భూమిని ఢీకొట్టే చాన్స్ ఎంత?, ఏ సమయంలో వస్తుంది, ఏ ప్రాంతంలో పడే చాన్స్ ఉందన్న వాటిని మరింత కచ్చితంగా అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. అంతేగాకుండా భవిష్యత్తులో ఆస్టరాయిడ్ల నుంచి భూమికి ఉండే ప్రమాదాలను గుర్తించేందుకు వీలవుతుందని స్పష్టం చేస్తున్నారు. అపోఫిస్‌ను 2004 డిసెంబర్‌లో తొలిసారిగా గుర్తించారు. దీని పరిమాణం వెయ్యి అడుగులు.. అంటే సుమారు 300 మీటర్లు. ఈఫిల్ టవర్ అంత ఎత్తు అనుకోవచ్చు. భూమి పరిమాణంతో పోలిస్తే.. ఈ సైజు అత్యంత చిన్నగానే కనిపిస్తున్నా ఒకవేళ ఇది భూమిని ఢీకొడితే జరిగే విలయం చాలా పెద్దగానే ఉంటుంది.
2029లో మరోసారి భూమికి దగ్గరగా ఈ ఆస్టరాయిడ్ ప్రయాణిస్తుంది. అప్పుడు అది భూమిని ఢీకొట్టే అవకాశాలు 2.7 శాతం వరకు ఉన్నట్టు లెక్కలు వేశారు. తాజాగా దాని ప్రయాణాన్ని క్షుణ్నంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు 2029లో భూమికి 40 వేల కిలోమీటర్ల దూరం నుంచే ఆస్టరాయిడ్ దూసుకెళ్తుందని తేల్చారు. ఖగోళ దూరాల పరంగా చూస్తే ఇది చాలా తక్కువ దూరం. చంద్రుడికి, భూమికి మధ్య దూరం సుమారు మూడు లక్షల కిలోమీటర్లు. అంటే అపోఫిస్ ఆస్టరాయిడ్.. చంద్రుడికి, భూమికి మధ్య నుంచే దూసుకెళ్తుందన్న మాట.
అయితే అది ప్రయాణించే వేగం కారణంగా భూమిని ఢీకొట్టే అవకాశం తక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు. తర్వాత 2036లోనూ ఈ ఆస్టరాయిడ్ భూమికి దగ్గరగా వెళ్తుంది. అయితే 2068వ సంవత్సరంలో ఈ ఆస్టరాయిడ్ భూమికి కేవలం 20 వేల కిలోమీటర్ల దూరం నుంచే ప్రయాణిస్తుందని.. ఒకవేళ ఆ టైంలో భూమి ఆకర్షణ శక్తికి లోనైతే భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని తేల్చారు. అయితే ప్రస్తుతం తిరుగుతున్న ఆస్టరాయిడ్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. 2185వ సంవత్సరం వరకు కూడా భూమికి ప్రమాదం ఏమీ లేదని సైంటిస్టులు చెబుతున్నారు.
ఆస్టరాయిడ్ల నుంచి డిఫెన్స్ కోసం..
సౌర కుటుంబంలో కొన్ని వేల కోట్ల ఆస్టరాయిడ్లు ఉన్నాయి. అందులో చాలా వరకు అంగారకుడికి, గురు గ్రహానికి మధ్య పరిభ్రమిస్తున్నాయి. కొన్ని తోకచుక్కల తరహాలో సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో తిరుగుతున్నాయి. అలా ప్రయాణించే మార్గంలో ఇతర గ్రహాల కక్ష్యలను దాటుతూ వెళతాయి. గ్రహాలకు సమీపంగా వస్తాయి. ఆస్టరాయిడ్లలో కొన్ని మీటర్ల సైజు నుంచి కిలోమీటర్ల కొద్దీ పొడవున్నవి ఉంటాయి. భూమికి సమీపం నుంచి వెళ్లేవాటిలో కనీసం వంద మీటర్లు, ఆపై పరిమాణం ఉన్న ఆస్టరాయిడ్లను ప్రమాదకరమైనవిగా భావిస్తారు. ఏవైనా ఆస్టరాయిడ్లు భూమిని ఢీకొట్టే చాన్స్ ఉంటే.. వాటిపైకి క్షిపణులు, శాటిలైట్లు ప్రయోగించడం ద్వారా ముక్కలు చేయడం, లేదా కక్ష్యను మార్చి ప్రమాదాన్ని నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రమాదకర ఆస్టరాయిడ్లను పరిశీలించేందుకు అరిజోనా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘ప్లానెటరీ డిఫెన్స్ సిస్టం’ ప్రోగ్రామ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment