బీజింగ్: లీ జింగ్వీకి తన అసలు పేరు ఏమిటో తెలీదు. ఎవరికి పుట్టాడో, ఎక్కడ పుట్టాడో కూడా తెలీదు. చిన్నప్పుడే కిడ్నాప్ అయిన లీకి తెలిసిందల్లా తాను ఆడుకున్న ఇల్లు, చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలే. వాటినే 30 ఏళ్ల పాటు గీస్తూ ఉండడంతో చివరికి లీ తన కన్నతల్లి దగ్గరకి చేరాడు. చైనాలో జరిగిన ఈ ఉద్వేగ భరితమైన కలయిక పతాక శీర్షికలకెక్కింది. 1989లో లీకి నాలుగేళ్ల వయసున్నప్పుడు పొరుగింట్లోని వ్యక్తి కల్లబొల్లి కబుర్లు చెప్పి తనతో తీసుకువెళ్లి కిడ్నాపర్లకి అప్పగించాడు.
కిడ్నాపర్లు నాలుగేళ్ల ఆ బాలుడిని రైల్లో హెనాన్ ప్రావిన్స్‌కి తీసుకువెళ్లి ఒక కుటుంబానికి అమ్మేశారు. అప్పట్నుంచి లీ తన కన్న తల్లిదండ్రుల కోసం పరితపిస్తూనే ఉన్నాడు. పసిబాలుడు కావడంతో వారి పేర్లు, ఊరి పేరు గుర్తు లేదు. కానీ తన ఇల్లు, దాని పక్కనే ఉన్న కొలను, చుట్టుపక్కల ఉండే కొండలు, అటవీ ప్రాంతం గుర్తుకు ఉండడంతో వాటిని గీస్తూనే ఉండేవాడు. చిన్నతనం నుంచి కొన్ని వందల, వేలసార్లు ఆ ఇంటి పరిసరాలను గీయడంతో అతను ఏదీ మర్చిపోలేదు.
పెరిగి పెద్దయ్యాక తన తల్లిదండ్రుల్ని కలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. చివరికి గత ఏడాది సోషల్ మీడియాలో తాను 30 ఏళ్లుగా గీస్తున్న చిత్రాన్ని పోస్టు చేయడంతో అది విస్తృతంగా షేర్ అయింది. దీంతో పోలీసులకి ఆ ఊరుని, లీ కుటుంబాన్ని కనిపెట్టడం సులభంగా మారింది. చివరికి ఈ ఏడాది కొత్త సంవత్సరం రోజు తన ఇద్దరు పిల్లల్ని వెంట పెట్టుకొని లీ తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత కన్నతల్లిని చూడగానే భావోద్వేగం పట్టలేక కిందపడిపోయాడు.
తన తండ్రి మరణించాడన్న విషయం తెలుసుకొని తెగ బాధపడ్డాడు. తోడబుట్టిన వారిని చూసి పట్టలేని ఆనందంతో కన్నీళ్లు కార్చాడు. వచ్చే నెల లూనార్ మాసం కావడంతో బంధు మిత్రులందరితో కలిసి తన తండ్రి సమాధిని సందర్శిస్తానని లీ చెప్పాడు. ఆ సమాధి దగ్గర నేను గొంతెత్తి చెప్పాలనుకుంటున్న మాట ‘‘సన్ ఈజ్ బ్యాక్’’ అంటూ లీ ఉద్వేగంతో చెప్పాడు.
Li Jingwei was abducted from his village when he was 4-years-old and trafficked across China. After over three decades of being apart, he drew the sketch of his home village from memory and finally traced his mother. #China #Reunion #EmotionalVideo #HeartTouchingVideo #NewsMo pic.twitter.com/5wM0KS6vKz
— IndiaToday (@IndiaToday) January 3, 2022
Comments
Please login to add a commentAdd a comment