న్యూఢిల్లీ: కాస్మటిక్స్ దిగ్గజం లో రియాల్ వ్యాపార సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళగా చరిత్ర సృష్టించారు. అలాగే ఏకంగా 100 బిలియన్ డాలర్ల పై చిలుకు సంపదను ఆర్జించిన తొలి మహిళగా కూడా ఆమె నిలిచారు. అంతేగాక ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ, గౌతం అదానీ, అమానికో ఓర్టెగా వంటి వ్యాపార దిగ్గజాలను వెనక్కు నెడుతూ 12వ స్థానానికి ఎగబాకారని బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకటించింది.
70 ఏళ్ల మేయర్స్ 268 బిలియన్ డాలర్ల విలువైన లో రియాల్ వ్యాపార సామ్రాజ్యానికి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. ఆమె కుటుంబానికి కంపెనీలో 35 శాతం దాకా వాటాలున్నాయి. 2017లో మేయర్స్ తల్లి మరణానంతరం అపారమైన ఆస్తి, కంపెనీ వాటాలు ఆమెకు వారసత్వంగా దక్కాయి. తాజాగా కంపెనీ వాటాల విలువ ఒక్కసారిగా చుక్కలనంటడంతో మేయర్స్ సంపద బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. మీడియాకు దూరంగా రోజూ గంటల తరబడి పియానో వాయిస్తూ గడుపుతుంటారామె.
Comments
Please login to add a commentAdd a comment