తమ చిన్నారితో జేమ్స్- చోలే దంపతులు(ఫొటో: గిన్నిస్‌వరల్డ్ రికార్డు)
సాక్షి, వెబ్‌డెస్క్: అతడు నటుడు.. ఆమె టీచర్.. స్నేహితుల ద్వారా ఓ పబ్‌లో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది... మొదటి చూపులోనే ఆమె.. అతడిని ఇష్టపడింది.. అతడికి కూడా ఆమెపై ప్రేమ చిగురించింది.. ఇద్దరి మనసులు కలిశాకా ఇంకేం ఉంటుంది.. మూడేళ్ల పాటు ప్రేమలో మునిగితేలాక.. ఓ మంచిరోజు చూసి ఐదేళ్ల కిత్రం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.. సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.. వారి ప్రేమకు గుర్తుగా ముద్దులొలికే రెండేళ్ల చిన్నారి ఒలీవియా. ఇందులో విశేషం ఏముంది.. సాధారణంగా లవ్‌స్టోరీలన్నీ ఇంచుమించు ఇలాగే ఉంటాయి కదా అంటారా..!
అసలు విషయం తెలిస్తే మీరు కూడా ఈ జంటను ప్రశంసించక మానరు! యునైటెడ్ కింగ్‌డంకు చెందిన జేమ్స్(33), చోలే లస్టడ్(27) ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. జేమ్స్ ఎత్తు 109.3 సెంటీమీటర్లు(మూడు అడుగుల 7 అంగుళాలు). ఆయన భార్య చోలే.. 166.1 సెం.మీ.(5 అడుగుల నాలుగు అంగుళాలు) ఎత్తు ఉంటారు. ఇద్దరి ఎత్తులో సుమారు 56.8 సెం.మీ. వ్యత్యాసం ఉంది. ఇదే.. వారు గిన్నిస్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకునేందుకు దోహదం చేసింది. ప్రపంచంలోనే ఎత్తులో అత్యంత తేడా కలిగిన దంపతులుగా ఘనత సాధించేలా చేసింది.
నిజానికి జేమ్స్‌కు డ్వార్‌ఫిజం డయాస్ట్రొఫిక్ డైస్‌ప్లాఏసియా అనే అరుదైన వ్యాధి వల్ల మరుగుజ్జుతనం వచ్చింది. చిన్న చిన్న లోపాలకే ప్రేమించిన వ్యక్తిని కాదనుకుని వెళ్లిపోయే ఈ రోజుల్లో.. జేమ్స్‌ను పెళ్లి చేసుకుని, ఆయనతో జీవితాన్ని పంచుకుంటున్న చోలే నిజంగా చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తారని వీరి ప్రేమకథ తెలిసిన వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలైన ప్రేమ ముందు ఈ రికార్డులు చిన్నబోతాయని అంటున్నారు. ఏదేమైనా గిన్నిస్ రికార్డు సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏంటీ.. ప్రేమ గుడ్డిది అంటారా? కానేకాదు.. ఎదుటి వ్యక్తి మనసుని మనోనేత్రంతో మరింత లోతుగా చూడగలిగే మహోన్నత శక్తి గల పవిత్రమైన భావన.. కాదంటారా?!
చదవండి: వధువు వాళ్లు మటన్ వండలేదని పెళ్లికొడుకు ఎంత పనిచేశాడు..
Comments
Please login to add a commentAdd a comment