ది హేగ్: నెదర్లాండ్స్‌లోని ఉత్తర సముద్రంలో సరుకు రవాణా చేసే ఒక నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటల్లో నౌకలో ఉన్న 3 వేల కార్లు దగ్ధమైనట్టు అంచనా. నౌక సిబ్బందిలో ఒకరు మంటల్లో చిక్కుకొని మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరు ప్రాణరక్షణ కోసం సముద్రంలో దూకారు. ఆ నౌకలో దట్టంగా పొగ అలుముకోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి 22 మంది నౌకా సిబ్బందిని ఆస్పత్రికి తరలించినట్టుగా డచ్ కోస్ట్‌గార్డ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
నౌకలో ఉన్న 25 ఎలక్ట్రిక్ కారుల్లో ఒక దానిలో మంటలు చెలరేగడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. జర్మనీలోని బ్రెమర్‌హెవన్ పోర్టు నుంచి ఈజిప్టులో మరో పోర్టుకి ఈ నౌక వెళుతుండగా మంగళవారం రాత్రి అమెలాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ నౌకలో మంటలు కొద్ది రోజుల పాటు కొనసాగుతాయని డచ్ కోస్ట్ గార్డ్ అంచనా వేస్తోంది. నౌకకి ఇరువైపులా నీళ్లు పోస్తూ మంటల్ని అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల నీళ్లు వేస్తే నౌక మునిగిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు తరలించడం కూడా ఒక ముప్పుగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment