
ఇలాంటి షిప్ ముందే తయారై ఉంటే ‘టైటానిక్’ మునగకపోయి ఉండేదేమో..! ‘టైటానిక్’ అనే ఓ అద్భుతమైన సినిమా వచ్చి ఉండకపోవచ్చేమో..! ఇలా ఎందుకు అంటున్నామంటే.. ఈ ఫొటోలో ఉన్న షిప్ పేరు ‘థండర్ చైల్డ్’. సముద్రాల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు మనుషులను వెతికి ప్రాణాలు కాపాడేందుకు దీన్ని వినియోగిస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది నీటిలో అస్సలంటే అస్సలు మునగదు.
ఆఖరికి బోల్తా కొట్టినా కూడా నీటిలో మునిగిపోదు! అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు వీలుగా ఐర్లండ్ నేవీ ఈ షిప్‌ను తయారు చేసింది. సేఫ్ హెవెన్ మెరైన్ అనే ఐరిష్ కంపెనీ దీన్ని అభివృద్ధి పరిచింది. ఇది సముద్రంలో గంటకు 62 మైళ్ల వేగంతో దూసుకుపోగలదు. 10 మంది ప్రయాణించేందుకు వీలున్న ఈ షిప్‌ను సముద్రంలోని బలమైన ఆటుపోటులను తట్టుకునేలా తయారు చేశారు. ఇందులోని కేబిన్ లోపల ఎప్పుడూ గాలి నింపి మునిగిపోకుండా చేశారు. అంటే ఒక రకంగా మన టైర్లలో ఎప్పుడూ గాలి ఉండాలి కదా అలా అన్నమాట.