Cars fire
-
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస
ఇంఫాల్: మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తౌబల్ జిల్లా లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో సోమవారం సాయంత్రం పోలీసు దుస్తుల్లో వచ్చిన దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో తౌబల్‌తోపాటు ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. దాంతో ఆగ్రహించిన ఒక వర్గం వారు నాలుగు కార్లకు నిప్పుపెట్టారు. కార్లు ఎవరివనే విషయం తెలియాల్సి ఉంది. కాల్పుల ఘటనను సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. దోషులను పట్టుకుని, చట్టం ముందు నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్‌లో గత ఏడాది మే 3వ తేదీన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మొయితీలున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకు ఉంటారు. -
నెదర్లాండ్స్ నౌకలో భారీ అగ్నిప్రమాదం
ది హేగ్: నెదర్లాండ్స్‌లోని ఉత్తర సముద్రంలో సరుకు రవాణా చేసే ఒక నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటల్లో నౌకలో ఉన్న 3 వేల కార్లు దగ్ధమైనట్టు అంచనా. నౌక సిబ్బందిలో ఒకరు మంటల్లో చిక్కుకొని మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరు ప్రాణరక్షణ కోసం సముద్రంలో దూకారు. ఆ నౌకలో దట్టంగా పొగ అలుముకోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి 22 మంది నౌకా సిబ్బందిని ఆస్పత్రికి తరలించినట్టుగా డచ్ కోస్ట్‌గార్డ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నౌకలో ఉన్న 25 ఎలక్ట్రిక్ కారుల్లో ఒక దానిలో మంటలు చెలరేగడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. జర్మనీలోని బ్రెమర్‌హెవన్ పోర్టు నుంచి ఈజిప్టులో మరో పోర్టుకి ఈ నౌక వెళుతుండగా మంగళవారం రాత్రి అమెలాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ నౌకలో మంటలు కొద్ది రోజుల పాటు కొనసాగుతాయని డచ్ కోస్ట్ గార్డ్ అంచనా వేస్తోంది. నౌకకి ఇరువైపులా నీళ్లు పోస్తూ మంటల్ని అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల నీళ్లు వేస్తే నౌక మునిగిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు తరలించడం కూడా ఒక ముప్పుగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
అగ్ని ప్రమాదం; 14 కార్లు దగ్ధం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలో బుధవారం రాత్రి వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో అనూహ్యంగా మంటలు చెలరేగడంతో 14 కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు రెండు ఫైర్ ఇంజన్లను సంఘటన స్థలానికి చేరుకున్నాయని, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని ఢిల్లీ అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. పాత కార్లను అమ్మకం, కోనుగోలు నిమిత్తం ఓ వ్యాపారి తన కార్లను బహిరంగ ప్రదేశంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు విచారిస్తున్నారు. -
అగ్నికి ఆహుతైన రెండు కార్లు
విజయవాడ: విజయవాడ నగరంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న రెండు కార్లు అనుమానాస్పద స్థితిలో కాలి పోయాయి. స్థానిక సాంబమూర్తి రోడ్డులోని కార్‌వాష్ సెంటర్ ఎదురుగా రెండు కార్లను పార్కు చేసి ఉంచారు. శనివారం తెల్లవారు జామున ఒక కారులో వ్యాపించిన మంటలు దాని పక్కనే ఉన్న మరో కారుకు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న కార్లను స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను ఆర్పారు. ఆకతాయిలు నిప్పంటించి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.