కౌలలాంపూర్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కారణంగా పెళ్లిల్లపై ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. 500-1000 మంది హాజరయ్యే పెళ్లి వేడుకలు ప్రస్తుతం 50-100 మంది అతిథిలతో ముగించేస్తున్నారు. అది కుదరకపోతే జూమ్‌లో వివాహ తంతు కానిచ్చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం ఈ నిబంధనలను పాటిస్తూ.. కేవలం సన్నిహితులను మాత్రమే వివాహానికి ఆహ్వానిస్తుండగా.. ఓ బడా బాబు మాత్రం ఏకంగా తన కుమారుడి వివాహానికి 10 వేల మంది అతిథిలను ఆహ్వానించాడు. 100-200 మందినే కంట్రోల్ చేయడం కష్టం అంటే ఈ పెళ్లికి వచ్చిన 10 వేల మంది కోవిడ్ నియమాలు పాటిస్తూ.. ఎంతో జాగ్రత్తగా వేడుకలో పాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ భారీ వివాహ వేడకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇదేలా సాధ్యం అనుకుంటే సదరు దంపతులు డ్రైవ్ థ్రూ వివాహం చేసుకోవడంతో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. (చదవండి: అనాథకు హోం మినిస్టర్ ‘కన్యాదానం’ )
ప్రస్తుతం ఈ పెళ్లి తంతు మలేషియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం మలేషియాలో పెళ్లి వేడుకలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో అక్కడి మాజీ మంత్రి టెంగ్కూ అద్నాన్ తన కుమారుడి వివాహానికి 10 వేల మందికిపైగా ఆహ్వానం పంపించారు. వారంతా కార్లలో వచ్చి అందులోనే కూర్చొని పెళ్లి వేడుకను వీక్షించారు. కార్లలోంచి చేతులు ఊపుతూ వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. వారు కార్లనుంచి దిగకపోవడంతో భౌతిక దూరం నిబంధనల ఉల్లంఘన జరగలేదు. అలానే కార్ల వద్దకే వెళ్లి అతిథులకు భోజనాలు వడ్డించారు. (చదవండి: ఫోను దొరికే వరకు పెళ్లి చేసుకోను! )
దీనిపై టెంగ్కూ అద్నాన్ స్పందిస్తూ తమ ఇంట్లోని పెళ్లికి 10 వేలమంది హాజరు కావడం ఆనందంగా ఉందని తెలిపారు. వచ్చిన వారంతా కార్లలోనే కూర్చొని పెళ్లిని చూశారని.. ఎక్కడా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించలేదని తెలిపారు. వారందరికీ డిన్నర్ ప్యాకెట్లు అందజేశామని చెప్పారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వివాహం అయిన మరుసటి రోజే సదరు మంత్రి అవినీతి కేసులో అరెస్ట్ అయ్యాడు. కోర్టు అతడికి జరిమానా, ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ఇక మలేషియాలో ఇప్పటి వరకు 95,300 కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment