పెళ్లి దృశ్యాలు
కాలిఫోర్నియా : పెళ్లి, కరోనా బంధం పాము, ముంగిస లాంటిది. ఈ రెండిటికి ఏ మాత్రం పడదు. అందుకే కరోనా సమయంలో వేలాది పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. పెళ్లికి ఒక రోజు ముందు పెళ్లి కూతురుకో, పెళ్లి కుమారుడికో కరోనా ఉందని తెలిసి పెళ్లి ఆపేసుకోవటం కూడా జరిగింది. అయితే ఈ జంట మాత్రం అందుకు భిన్నంగా తమ పెళ్లి విషయంలో ‘పాజిటివ్’గా ఆలోచించింది. అమెరికాలోని, కాలిఫోర్నియాకు చెందిన పాట్రిక్ డెల్గాడో, లూరెన్ జిమెనెజ్‌లు కొద్దిరోజుల క్రితం పెళ్లి చేసుకోవటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పెళ్లికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉండగా పెళ్లి కూతురు లూరెన్‌కు కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో ఆమె క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. అయితే కరోనా కారణంగా పెళ్లి ఆపటానికి ఆ జంట ఏ మాత్రం ఇష్టపడలేదు. (ఆ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోయా : నటి)
ఎలాగైనా అనుకున్న సమయానికి ఒక్కటవ్వాలని నిశ్చయించుకున్నారు. వీరికి యానిమేషన్ సినిమా ‘టాంగ్లెడ్’ స్పూర్తిగా నిలిచింది. పెళ్లి రోజున లూరెన్ క్వారంటైన్‌లో ఉంటున్న ఇంటి రెండవ అంతస్తు మీదనుంచి బయట నేల మీద వరకు ఓ తాడును ఏర్పాటు చేశారు. తాడు రెండు చివర్లను ఇద్దరూ తమ చేతులకు కట్టుకున్నారు. ఆ తాడును ఎన్నటికీ విడిపోని తమ బంధానికి గుర్తుగా భావిస్తూ పెళ్లి తంతును ముగించారు. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ జెస్సికా జాక్సన్ ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. పెళ్లికి సంబంధించిన వివరాలను సైతం పొందుపరిచారు. దీంతో ఈ పెళ్లి వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment