గర్భధారణ, పిల్లలు పుట్టడం గురించి బహిరంగంగా చర్చించని సమయం గతంలో ఉండేది. నాటి రోజుల్లో ఈ విషయాలను గోప్యంగా ఉంచడం సరైనదని చాలామంది భావించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. భార్య గర్భం ధరించినది మొదలు అడుగడుగునా ఆమెకు తోడుగా భర్త ఉంటున్నాడు. కొన్ని దేశాల్లో భార్య డెలివరీ సమయంలో భర్త అక్కడే ఉండి, డెలివరీ ప్రక్రియనంతా చూసే అవకాశం కూడా ఉంది. భార్యకు భరోసానిచ్చేందుకే భర్తకు ఇటువంటి అవకాశం కల్పిస్తున్నారు.
అయితే ఇటువంటి సమయంలో కొన్నిసార్లు విచిత్రమైన సంఘటనలు కూడా చోటుచేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన భార్య ప్రసవ సమయంలో శస్త్రచికిత్స గదిలోనికి వెళ్లి, డెలివరీ ప్రక్రియనంతా చూశాడు. భార్యకు జరిగిన సి-సెక్షన్ డెలివరీ, బిడ్డ పుట్టడం మొదలైనవి చూసిన తర్వాత కళ్లు తిరిగి పడిపోయాడు. కోలుకున్న తరువాత అతను.. తన భార్యకు జరిగిన డెలివరీ తన మనసుపై తీవ్ర ప్రభావం చూపిందని, అది తనకు మానసిక వ్యాధిగా పరిణమించిందని ఆరోపిస్తూ ఆసుపత్రిపై కేసు వేశాడు.
ఆ భర్త పేరు అనిల్ కొప్పుల. 2018లో అతని భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది. సి-సెక్షన్ ద్వారా ఆమెకు డెలివరీ జరిగింది. అమెకు డెలివరీ జరిగిన దృశ్యాన్ని చూసిన వెంటనే తాను మానసికంగా అస్వస్థతకు లోనయ్యానని అనిల్ ఆరోపించాడు. తరువాత అతను మెల్‌బోర్న్‌లోని రాయల్ ఉమెన్స్ హాస్పిటల్‌పై కేసు పెట్టాడు. ప్రసవాన్ని చూసేందుకు ఆసుపత్రి యాజమాన్యం తనను ప్రోత్సహించిందని కొప్పుల ఆరోపించారు. సర్జరీ దృశ్యాన్ని చూశాక తన మానసిక పరిస్థితి క్షీణించిందని, అందుకే ఆసుపత్రి వర్గాలు తనకు నష్ట పరిహారం చెల్లించాలని కోరాడు. కోర్టులో విచారణ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ తన మానసిక అనారోగ్యం కారణంగా భార్యతో విడాకులు కూడా తీసుకోవలసి వచ్చిందని, అందుకే తాను పరిహారం పొందేందుకు అర్హుడని పేర్కొన్నాడు. అయితే భార్య ప్రసవ సమయంలో అనిల్ ఆరోగ్యం బాగానే ఉన్నదని, అతను ఎటువంటి ఇబ్బంది పడలేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇటువంటి నిరాధారమైన కేసును మూసివేయాలని ఆసుపత్రి వర్గాలు కోర్టును కోరాయి.
ఇది కూడా చదవండి: టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా?
Comments
Please login to add a commentAdd a comment