ఆపరేషన్ విజయవంతమయ్యాక భార్యతో లారెన్స్
వాషింగ్టన్: అమెరికాలోని మేరీలాండ్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి డాక్టర్లు పంది గుండె అమర్చారు. అతడి ప్రాణం కాపాడారు. ఇలాంటి అరుదైన చికిత్స జరగడం అమెరికాలో ఇది రెండోసారి కావడం విశేషం. బాధితుడు లారెన్స్ ఫాసెట్ నావికాదళంలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. అతడి వయసు ప్రస్తుతం 58 ఏళ్లు. గుండె వైఫల్యంతో బాధపడుతున్నాడు. మరణానికి దగ్గరయ్యాడు.
ఇతర వ్యాధులు కూడా ఉండడంతో సంప్రదాయ గుండె మారి్పడికి అవకాశం లేకుండాపోయింది. దాంతో ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడిసిన్’ డాక్టర్లు కష్టతరమైన ప్రయోగానికి సిద్ధమమయ్యారు. లారెన్స్ ఫాసెట్‌కు ఇటీవలే పంది గుండెను అమర్చారు. ఈ చికిత్స విజయవంతమైంది. రెండు రోజుల విశ్రాంతి తర్వాత అతడి ఆరోగ్యం మెరుగైంది.
ఇదే ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడిసిన్’ వైద్యులు గత ఏడాది పంది గుండెను డేవిట్ బెనెట్ అనే వ్యక్తికి అమర్చారు. కానీ, అతడు రెండు నెలలు మాత్రమే జీవించాడు. ఈ విషయం తెలిసి కూడా లారెన్స్ ఫాసెట్ శస్త్రచికిత్సకు సిద్ధపడ్డాడు. తాను నిండు నూరేళ్లు జీవిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అమెరికాలో మానవ అవయవాలకు కొరత ఏర్పడింది. దేశంలో గత ఏడాది కేవలం 4,100 గుండె మార్చిడి చికిత్సలు చేశారు. గుండెతోపాటు ఇతర అవయవాల కోసం పెద్ద సంఖ్యలో బాధితులు ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment