రష్యాకు మరో ఎదురుదెబ్బ | Massive blast cripples parts of Crimea-Russia bridge | Sakshi
Sakshi News home page

రష్యాకు మరో ఎదురుదెబ్బ

Published Sun, Oct 9 2022 4:15 AM | Last Updated on Sun, Oct 9 2022 4:15 AM

Massive blast cripples parts of Crimea-Russia bridge - Sakshi

ఖర్కీవ్‌: ఉక్రెయిన్‌పై కొనసాగిస్తున్న యుద్ధంలో రష్యాకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. రష్యా ప్రధాన భూభాగంతో క్రిమియా ద్వీపకల్పాన్ని కలిపే వంతెనపై శనివారం పేలుడు సంభవించి కొంతభాగం దెబ్బతింది. దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యా బలగాలకు అవసరమైన యుద్ధ సామగ్రి రవాణాకు ఈ వంతెనే కీలకం. వంతెనను పేల్చేస్తామంటూ పలుమార్లు హెచ్చరికలు చేసిన ఉక్రెయిన్‌ ఘటనపై అధికారికంగా స్పందించలేదు. అక్కడి అధికారులు, పలువురు నేతలు మాత్రం ఈ ఘటనపై హర్షం వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై ప్రత్యేక స్టాంప్‌ విడుదల చేస్తామని ఉక్రెయిన్‌ పోస్టల్‌ శాఖ ప్రకటించింది.

గత మేలో రష్యా యుద్ధనౌక మునిగిపోయినప్పుడు పోస్టల్‌ శాఖ స్టాంపులను విడుదల చేయడం గమనార్హం. ఘటనపై రష్యా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఉక్రెయిన్‌లో స్వాధీనం చేసుకున్న లేమన్‌ వంటి ప్రాంతాలను కోల్పోయిన రష్యాకు ఇది షాకిచ్చే పరిణామం. ఘటనాస్థలిని రష్యా నిఘా అధికారులు పరిశీలించారు. ‘ట్రక్కు బాంబు పేలుడుతో వంతెనలోని వాహనాలు రాకపోకలు సాగించే రెండు సెక్షన్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంధనం తీసుకెళ్తున్న ఏడు రైల్వే వ్యాగన్లకు మంటలు అంటుకున్నాయి.

ముగ్గురు చనిపోయారు’అని తెలిపారు. ఘటనతో రైళ్లు, వాహనాల రాకపోకలను కొద్దిగంటలపాటు నిలిపివేశారు. తాత్కాలిక మరమ్మతుల అనంతరం తిరిగి రాకపోకలను ప్రారంభించారు. 2014లో క్రిమియాను ఆక్రమించిన రష్యా కెర్చ్‌ జలసంధి మీదుగా యూరప్‌లోనే అత్యంత పొడవైన, 12 మైళ్ల వంతెనను 2018లో నిర్మించింది. రైళ్లు, ఇతర వాహనాలు రాకపోకలకు వీలుగా వంతెనపై రెండు వేర్వేరు సెక్షన్లున్నాయి.

ఉక్రెయిన్‌లో తమ సేనలకు ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ జనరల్‌ సెర్గీ సురోవికిన్‌ నేతృత్వం వహిస్తారని వంతెనపై పేలుడు సంభవించిన కొద్ది గంటల్లోనే రష్యా అధికారికంగా ప్రకటించింది. సురోవికిన్‌ ఇప్పటి వరకు దక్షిణ ఉక్రెయిన్‌లో సేనలకు నాయకత్వం వహిస్తున్నారు. బ్రిడ్జి బాంబింగ్‌ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై కౌంటర్‌ టెర్రరిజం ఆపరేషన్‌ చేపట్టాలని రష్యా ప్రజాప్రతినిధులు అధ్యక్షుడు పుతిన్‌ను కోరారు. పుతిన్‌ ఇందుకు సానుకూలంగా స్పందించిన పక్షంలో అధికార యంత్రాంగానికి విస్తృత అధికారులు దఖలు పడతాయి.

ఖర్కీవ్‌పై క్షిపణుల పరంపర
ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌పైకి శనివారం వేకువజామునుంచే రష్యా క్షిపణులు దూసుకొచ్చాయి. ఖర్కీవ్‌ సమీపంలోని మూడు పట్టణాల్లోని నివాస ప్రాంతాల్లో పడటంతో ఒకరు చనిపోయారు. ఈ దాడుల్లో రష్యా ఎస్‌–300 క్షిపణులను ప్రయోగించినట్లు అధికారులు వెల్లడించారు. పేలుడు సామగ్రి నిండుకోవడం వల్లే ప్రధానంగా గగనతలం నుంచి భూమిపై లక్ష్యాలను చేధించటానికి వాడే ఈ క్షిపణులను రష్యా ప్రయోగించినట్లు భావిస్తున్నారు. సుమీ ప్రాంతంపై రష్యా ఫిరంగులు, క్షిపణులతో దాడులు కొనసాగించింది.

ఖెర్సన్‌ నుంచి పౌరుల తరలింపు
ఉక్రెయిన్‌ బలగాల తీవ్ర ప్రతిఘటనతో రష్యా బెంబేలెత్తుతోంది. ఇటీవల రఫరెండంతో కలిపేసుకున్న నాలుగు ప్రాంతాల్లో ఒకటైన ఖెర్సన్‌ నుంచి పౌరులను రష్యాలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. చిన్నారులు, వృద్ధులు తదితరులకు దక్షిణ రష్యాలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉక్రెయిన్‌ బలగాలతో హోరాహోరీ తప్పదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement