explosive incident
-
రష్యాకు మరో ఎదురుదెబ్బ
ఖర్కీవ్: ఉక్రెయిన్‌పై కొనసాగిస్తున్న యుద్ధంలో రష్యాకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. రష్యా ప్రధాన భూభాగంతో క్రిమియా ద్వీపకల్పాన్ని కలిపే వంతెనపై శనివారం పేలుడు సంభవించి కొంతభాగం దెబ్బతింది. దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యా బలగాలకు అవసరమైన యుద్ధ సామగ్రి రవాణాకు ఈ వంతెనే కీలకం. వంతెనను పేల్చేస్తామంటూ పలుమార్లు హెచ్చరికలు చేసిన ఉక్రెయిన్ ఘటనపై అధికారికంగా స్పందించలేదు. అక్కడి అధికారులు, పలువురు నేతలు మాత్రం ఈ ఘటనపై హర్షం వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై ప్రత్యేక స్టాంప్ విడుదల చేస్తామని ఉక్రెయిన్ పోస్టల్ శాఖ ప్రకటించింది. గత మేలో రష్యా యుద్ధనౌక మునిగిపోయినప్పుడు పోస్టల్ శాఖ స్టాంపులను విడుదల చేయడం గమనార్హం. ఘటనపై రష్యా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఉక్రెయిన్‌లో స్వాధీనం చేసుకున్న లేమన్ వంటి ప్రాంతాలను కోల్పోయిన రష్యాకు ఇది షాకిచ్చే పరిణామం. ఘటనాస్థలిని రష్యా నిఘా అధికారులు పరిశీలించారు. ‘ట్రక్కు బాంబు పేలుడుతో వంతెనలోని వాహనాలు రాకపోకలు సాగించే రెండు సెక్షన్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంధనం తీసుకెళ్తున్న ఏడు రైల్వే వ్యాగన్లకు మంటలు అంటుకున్నాయి. ముగ్గురు చనిపోయారు’అని తెలిపారు. ఘటనతో రైళ్లు, వాహనాల రాకపోకలను కొద్దిగంటలపాటు నిలిపివేశారు. తాత్కాలిక మరమ్మతుల అనంతరం తిరిగి రాకపోకలను ప్రారంభించారు. 2014లో క్రిమియాను ఆక్రమించిన రష్యా కెర్చ్ జలసంధి మీదుగా యూరప్‌లోనే అత్యంత పొడవైన, 12 మైళ్ల వంతెనను 2018లో నిర్మించింది. రైళ్లు, ఇతర వాహనాలు రాకపోకలకు వీలుగా వంతెనపై రెండు వేర్వేరు సెక్షన్లున్నాయి. ఉక్రెయిన్‌లో తమ సేనలకు ఎయిర్ ఫోర్స్ చీఫ్ జనరల్ సెర్గీ సురోవికిన్ నేతృత్వం వహిస్తారని వంతెనపై పేలుడు సంభవించిన కొద్ది గంటల్లోనే రష్యా అధికారికంగా ప్రకటించింది. సురోవికిన్ ఇప్పటి వరకు దక్షిణ ఉక్రెయిన్‌లో సేనలకు నాయకత్వం వహిస్తున్నారు. బ్రిడ్జి బాంబింగ్ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ చేపట్టాలని రష్యా ప్రజాప్రతినిధులు అధ్యక్షుడు పుతిన్‌ను కోరారు. పుతిన్ ఇందుకు సానుకూలంగా స్పందించిన పక్షంలో అధికార యంత్రాంగానికి విస్తృత అధికారులు దఖలు పడతాయి. ఖర్కీవ్‌పై క్షిపణుల పరంపర ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌పైకి శనివారం వేకువజామునుంచే రష్యా క్షిపణులు దూసుకొచ్చాయి. ఖర్కీవ్ సమీపంలోని మూడు పట్టణాల్లోని నివాస ప్రాంతాల్లో పడటంతో ఒకరు చనిపోయారు. ఈ దాడుల్లో రష్యా ఎస్–300 క్షిపణులను ప్రయోగించినట్లు అధికారులు వెల్లడించారు. పేలుడు సామగ్రి నిండుకోవడం వల్లే ప్రధానంగా గగనతలం నుంచి భూమిపై లక్ష్యాలను చేధించటానికి వాడే ఈ క్షిపణులను రష్యా ప్రయోగించినట్లు భావిస్తున్నారు. సుమీ ప్రాంతంపై రష్యా ఫిరంగులు, క్షిపణులతో దాడులు కొనసాగించింది. ఖెర్సన్ నుంచి పౌరుల తరలింపు ఉక్రెయిన్ బలగాల తీవ్ర ప్రతిఘటనతో రష్యా బెంబేలెత్తుతోంది. ఇటీవల రఫరెండంతో కలిపేసుకున్న నాలుగు ప్రాంతాల్లో ఒకటైన ఖెర్సన్ నుంచి పౌరులను రష్యాలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. చిన్నారులు, వృద్ధులు తదితరులకు దక్షిణ రష్యాలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉక్రెయిన్ బలగాలతో హోరాహోరీ తప్పదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. -
కొన్ని గంటల్లో సీఎం పర్యటన.. పేలుడు కలకలం
భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూటౌన్ పరిధిలో శుక్రవారం రాత్రి పేలుడు సంభవించింది. ఉండి రోడ్డులోని జంట కాలువల సమీపంలోని పెట్రోల్ బంక్ పక్కన ఖాళీ స్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు బాంబుతో సంభవించిందా లేక మరేదైనా కారణమా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం భీమవరంలో పర్యటించనుండగా.. పేలుడు సంభవించడంతో పోలీస్, అధికార యంత్రాంగాలు కలవరపడ్డాయి. సీఎం పర్యటన కోసం వచ్చిన బాంబ్ స్క్వా డ్ పేలుడు సంభవించిన ప్రాంతంలో అణువణువు తనిఖీ చేసింది. సమాచారం అందుకున్న ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటన బాంబు పేలుడు వల్ల సంభవించలేదని ఆయన ప్రాథమికంగా నిర్ధారించారు. పాత ఫ్రిజ్‌లోని గ్యాస్ సిలిండర్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే ఏదైనా బ్యాటరీ వల్ల గాని పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. నిపుణులు పరీక్షల అనంతరమే దీనికి కారణం ఏమిటనేది స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఆవు కాలు వేయడంతో.. పెట్రోల్ బంక్ పక్కన ఎంతోకాలంగా పాత ఇనుప సామాను వ్యాపారం నిర్వహిస్తున్నారు. షాపు వెనుక ఖాళీ ప్రదేశంలో పాత ఇనుప సామగ్రిని నిల్వ చేస్తుంటారు. అదే ప్రాంతంలో పచ్చిక ఉండటంతో నిత్యం ఆవులు మేత కోసం అక్కడికి వస్తుంటాయి. శుక్రవారం రాత్రి ఆవులు పచ్చగడ్డి మేస్తుండగా ఒక ఆవు గుర్తుతెలియని వస్తువుపై కాలువేయడంతో పేలుడు సంభవిం చింది. పేలుడు ధాటికి ఆవు వెనుక కాలు పూర్తిగా దెబ్బతినగా.. పొట్టభాగంలో తీవ్ర గాయమై కదలలేని స్థితిలో పడిపోయింది. పేలుడు శబ్దం చాలాదూరం వినిపించినట్టు చెబుతున్నారు. -
తాడేపల్లిలో పేలుడు కలకలం!
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురం ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ నివాసంలో పేలుడు జరగడంతో ఆ నివాసం రేకులు లేచి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లమీద పడ్డాయి. ఒక్కసారిగా బాంబు పేలిందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... బ్రహ్మానందపురంలోని బొగ్గిళ్లల్లో బాపట్ల శివశంకర్ భార్య, ముగ్గురు కుమార్తెలతో నివాసం ఉంటున్నారు. శివశంకర్ తాపీ పని చేస్తుండగా, ఇంట్లో కుటుంబసభ్యులు నేల టపాకాయలు తయారు చేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో బాపట్ల శివశంకర్, భార్య మణికుమారికి మధ్య గొడవలు జరగడంతో ఆమె చిన్న కుమార్తెను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి నేలటపాకాయలను చుట్టే బాధ్యతను రెండో కుమార్తె బాపట్ల ఎస్తేరురాణి తీసుకుంది. తండ్రి తాపీ పనికి వెళ్లిన తర్వాత నేల టపాకాయలు తయారు చేయడానికి అవసరమైన పేలుడు పదార్థం, రాళ్లు, మిగతా సామగ్రిని దగ్గరపెట్టుకొని నేలటపాకాయలు చుడుతుండగా, ఒత్తిడి ఎక్కువై పేలుడు సంభవించింది. దీంతో ఎస్తేరురాణి ఒళ్లంతా రక్తంతో రోడ్డు మీదకు వచ్చి, ఏడుస్తుండడంతో స్థానికులు ఆమెను వైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొదట బంధువులు గ్యాస్ సిలిండర్ పేలి ఎస్తేరురాణికి గాయలైనట్లు తెలియజేశారు. పేలుడు విషయం ఆనోటా ఈనోటా తాడేపల్లి పోలీసుల చెవిన పడడంతో సీఐ అంకమరావు నేతృత్వంలో ఎస్సై వినోద్‌కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా, బాంబు కాదు... నేల టపాకాయలు ఎటువంటి అనుమతులు లేకుండా తయారు చేయడం వల్లనే ఈ సంఘటన జరిగిందని నిర్ధారించారు. పోలీసులు అక్కడ ఉండగానే స్థానికంగా ఉండే ఓ వ్యక్తి రెండు ప్లాస్టిక్ గోనె సంచుల్లో నేలటపాకాయలు తీసుకొని పారిపోతుండగా ఎస్సై వినోద్‌కుమార్ వెంటపడ్డారు. ఆ వ్యక్తి నేల టపాకాయలను అక్కడ పడేసి పరారయ్యాడు. జరిగిన సంఘటనపై గుంటూరు నార్త్ జోన్ డీఎస్పీ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం రెవెన్యూ, పోలీసులు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు. తీవ్రంగా గాయపడిన ఎస్తేరురాణి గాయపడిన ఎస్తేరురాణికి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స చేస్తున్న వైద్య సిబ్బంది నేలటపాకాయలు చుడుతున్న ఎస్తేరురాణి తీవ్రంగా గాయపడింది. కళ్ల నరాలు దెబ్బతినడంతో పాటు ముఖంమీద, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వ వైద్యులు రెండు, మూడు రోజులు గడిస్తే చూపు వచ్చే అవకాశం ఉందని, మోకాలుకు మాత్రం శస్త్రచికిత్స చేయాలని తెలిపారు. -
మృతుల కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం
- కుటుంబానికో ఉద్యోగం ఇవ్వాలి - దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల డిమాండ్ తాడేపల్లిగూడెం : సహజ వాయువు పైపులైన్ పేలుడు ఘటనలో దుర్మరణం చెందిన వారి కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కోరారు. తూర్పు గోదావరి జిల్లా నగరంలో పేలుడు ప్రాంతాన్ని శుక్రవారం సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన చూశారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రదాన్‌ను మంత్రి కోరారు . మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్ట పరిహారంతోపాటు ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చమురు, సహజవాయువులను వెలికితీసే ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరుగుతూ స్థానిక ప్రజలు తీవ్ర కష్ట నష్టాలకు గురవుతున్నారని, అయితే ప్రయోజనాలు మాత్రం ఇతర రాష్ట్రాలకు చేకూరుతున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఒఎన్జీసీ కేటాయించే కేంద్రీయ అభివృద్ధి నిధులను కచ్చితంగా స్థానికంగానే ఖర్చు చేయాలని కోరారు. ఉద్యోగ నియామకాల్లో 50 శాతం ఉద్యోగాలను స్థానికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర మంత్రి ప్రదాన్ సానుకూలంగా స్పందించారన్నారు. నగరం గ్రామ పరిధిలో మూడు వేల మందికి ఉదయం, రాత్రి దేవాదాయశాఖ తరపున మంత్రి మాణిక్యాలరావు భోజనాలు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు మంత్రి మాణిక్యాలరావును అభినందించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు తదితరులు మంత్రితోపాటు ఉన్నారు.