ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 69 మంది మృతి! | 60 Dead And Over 100 Injured After Powerful 6.9 Magnitude Earthquake Strikes Philippines Cebu Island, Video Inside | Sakshi
Sakshi News home page

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 69 మంది మృతి!

Oct 1 2025 7:17 AM | Updated on Oct 1 2025 2:00 PM

 Massive Earthquake Hits Philippines

ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం కుదిపేసింది(Philippines Earthquake). మంగళవారం రాత్రి మధ్య సెబు(Cebu Earthquake) ద్వీపం కేంద్రంగా .. రిక్టర్‌స్కేల్‌పై 6.9 తీవ్రతతో భారీగా భూమి కంపించింది. ఇప్పటిదాకా 69 మంది మరణించినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తుండగా.. ఆ సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటిదాకా 150 మందికి గాయాలైనట్లు సమాచారం. 

యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే ప్రకారం.. మంగళవారం రాత్రి 9గం.59ని. సమయంలో భూమి కంపించింది. బోగో నగర ఈశాన్య దిశగా 17 కిలోమీటర్ల దూరంలో.. 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదు అయ్యింది. ఈ లోతు భూకంపాన్ని.. శాలో భూకంపం (shallow earthquake) గా పరిగణిస్తారు. ఈ తరహా భూకంపాలు ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. తాజా ప్రకంపనల ధాటికి ఇళ్లు, ఆఫీసులు కూలిపోగా.. రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బ తిన్నాయి. 

భూకంపం ధాటికి రోడ్ల మీదకు పరుగులు తీసిన జనాలు.. రాత్రంతా రోడ్ల మీదే భయంతో జాగారం చేస్తూ ఉండిపోయారు. ప్రకంపనల ధాటికి ఇళ్ల గోడలు పగిలిపోయాయని, రోడ్లు చీలిపోయాయని, రాత్రంతా చీకట్లలోనే గడిపామని వాళ్లు అంటున్నారు. దాన్బంటాయన్ (Daanbantayan) సమీపంలో ఉన్న చారిత్రక రోమన్ కాథలిక్ చర్చ్‌ తీవ్రంగా దెబ్బతిందని అధికారులు ధృవీకరించారు.  తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉండడంతో తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసి అధికారులు.. ముప్పు లేకపోవడంతో దానిని ఉపసంహరించుకున్నారు. 

ప్రకంపనల ధాటికి బోగో చుట్టు పక్కల చాలా గ్రామాలు, పట్టణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి కొండ చరియలు ఓ ఊరిపై విరిగిపడ్డాయని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రాణ,  ఆస్తి నష్టాల స్పష్టతపై మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ఒక్క బోగోలోనే 14 మంది మరణించినట్లు సెబూ గవర్నర్‌ పమేలా బారిక్యువాట్రో ప్రకటించారు. సాన్‌ రెమిగియో పట్టణంలో ఆరుగురు మృతి చెందినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.

భారీ ప్రకంపనల ధాటికి సముద్ర అలలు ఎగసిపడడంతో సునామీ హెచ్చరికలు(Philippines Tsunami Alert) జారీ చేశారు. సెబూతో పాటు లెయిట్‌, బిలిరన్‌ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే ఆ తర్వాత ఆ సునామీ ముప్పు లేదని ధృవీకరించుకున్నాక ఆ హెచ్చరికను ఎత్తేసినట్లు ఫిలిప్పీన్స్‌ వోల్కనాలజీ అండ్‌ సెస్మాలజీ సంస్థ డైరెక్టర్‌ టెరెసిటో బాకోల్‌కోల్‌ ప్రకటించారు.

ఫసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ జోన్‌లో ఉన్న ఈ దేశంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలు కావడంతో పాటు ప్రతీ ఏటా పదుల సంఖ్యలో తుపానులు విరుచుకుపడుతూ తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంటాయి. తాజాగా సెబు ద్వీపాన్నే తుపాను వణికించింది. దీని ధాటికి 26 మంది మరణించగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ విపత్తు నుంచి తేరుకునేలోపే ఇప్పుడు భూకంపం తీవ్ర నష్టం కలిగించింది. 

ఇదీ చదవండి: మళ్లీ ట్రంప్‌ టారిఫ్‌ బాంబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement