గ్రీన్‌లాండ్‌లో మంచు విరిగిపడ్డ సంకేతాలవి
సరిగ్గా ఏడాది క్రితం ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా దాకా ప్రపంచమంతటా 9 రోజులపాటు తరచుగా వినిపించిన వింత శబ్దాల రహస్యం వీడిపోయింది. ఈ శబ్దాలకు భూప్రకంపనలు కారణం కాదని పరిశోధకులు తేల్చారు. గ్రీన్‌లాండ్‌లోని మారుమూల ప్రాంతం డిక్సన్ ఫోర్డ్‌లో భారీగా మంచు చరియలు విరిగిపడడం వల్ల భూమి స్వల్పంగా కంపించడంతో ఉత్పత్తి అయిన శబ్దాలుగా గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. భూకంపాలను అధ్యయనం చేసే పరిశోధకులు 2023 సెపె్టంబర్‌లో రహస్య శబ్ద సంకేతాలను గుర్తించారు. గతంలో ఇలాంటి సంకేతాలు ఎన్నడూ కనిపెట్టలేదు. ఇవి సాధారణ భూప్రకంపనల్లాంటివి కాకపోవడంతో వారిలో ఆసక్తి పెరిగింది. ఒకే వైబ్రేషన్ ప్రీక్వెన్సీతో శబ్దాలు వినిపించాయి.
దీనిపై అధ్యయనం కొనసాగించి, గుట్టు విప్పారు. డిక్సన్ ఫోర్డ్‌లో మంచు కొండల నుంచి విరిగిపడిన మంచు, రాళ్లతో 10 వేల ఒలింపిక్ ఈత కొలనులు నింపవచ్చని తెలిపారు. మంచు చరియల వల్ల మెగా సునామీ సంభవించి, సముద్రంలో 200 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడ్డాయని చెప్పారు. లండన్‌లోని బిగ్ బెన్ గడియారం కంటే రెండు రెట్ల ఎత్తుకు అలలు ఎగిశాయని వెల్లడించారు. భారీ అలల ప్రభావం ఏకంగా 9 రోజులపాటు కొనసాగిందని అన్నారు. దీనికారణంగానే వింత శబ్దాలు వినిపించినట్లు స్పష్టంచేశారు.
గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి గ్రీన్‌లాండ్‌లో మంచు కరుగుతోంది. సముద్రంలో దశాబ్దాలపాటు స్థిరంగా నిలిచి ఉన్న భారీ మంచు పర్వతాలు సైతం చిక్కిపోతున్నాయి. అవి బలహీనపడి, మంచు ముక్కలు జారిపడుతున్నాయి. వాతావరణ మార్పులు, భూతాపం వల్ల హిమానీనదాలు గత కొన్ని దశాబ్దాల్లో పదుల మీటర్ల పరిమాణంలో చిక్కిపోయాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భూ ధ్రువ ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడడం, సునామీలు ఇక సాధారణ అంశంగా మారిపోతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. భూగోళం వేడెక్కడం ఇంకా కొనసాగితే అవాంఛనీయ పరిణామాలు సంభవించడం తథ్యమని పేర్కొన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment