NRI: జాలి చూపడమే అతని తప్పైంది! | Sakshi
Sakshi News home page

ఘోరం.. జాలి చూపడమే ఆ భారతీయుడి తప్పైంది!

Published Mon, Jan 29 2024 9:03 PM

MBA Student Vivek Saini From India Deceased In USA - Sakshi

న్యూయార్క్‌: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆశ్రయం లేని వ్యక్తిపై జాలి చూపించిన క్రమంలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. సాయం చేశాడన్న కృతజ్ఞత మరిచిన ఆ వ్యక్తి.. భారతీయ విద్యార్థిని దారుణంగా హత్య చేశాడు. జార్జియాలో జనవరి 16న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భారత్‌లోని హర్యానాకు చెందిన 25 ఏళ్ల వివేక్‌ సైనీ రెండేళ్ల  క్రితం అమెరికా వెళ్లాడు. ఇటీవల ఎంబీఏ పట్టా కూడా పొందాడు. జార్జియాలోని ఓ స్టోర్‌లో పార్ట్‌ టైమ్‌ క్లర్క్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల తాను పనిచేస్తున్న స్టోర్‌ వద్ద అతనికి జూలియన్‌ ఫాల్కెనర్‌ అనే వ్యక్తి కన్పించాడు. అతడిని చూస్తే నిలువ నీడలేనట్టు కనిపించాడు. దీంతో చలించిపోయిన వివేక్‌  మానవత్వంతో అతన్ని చేరదీశాడు.

రెండు రోజుల పాటు తినడానకి ఫుడ్‌ ఇస్తూ సాయం చేశాడు. ఇక.. అక్కడ చలి ఎక్కువగా ఉండటంతో వేసుకొనేందుకు తనవద్ద ఉన్న జాకెట్‌ను కూడా ఇచ్చాడు. రోజూలాగే జనవరి 16న కూడా జూలియన్‌ స్టోర్‌ వద్దకు వచ్చాడు. అయితే అప్పటికే దుకాణం మూసేసి ఇంటికి వెళ్తున్న వివేక్.. అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు.

వివేక్‌  మాటలను అతను పట్టించుకోలేదు. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోవాలని లేదంటే పోలీసులకు ఫోన్‌ చేస్తానని అన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన జూలియన్‌ తన వెంట ఉన్న సుత్తితో విచక్షణారహితంగా వివేక్‌ తలపై కొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే వివేక్‌ మృతి చెందాడు. నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

జూలియన్‌ మత్తుపదార్థాలకు బానిసై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు  పేర్కొన్నారు. వివేక్‌ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

చదవండి: మాల్దీవుల పర్యాటకం.. తగ్గిన భారత టూరిస్టులు

Advertisement
Advertisement