
రష్యా క్షిపణి దాడిలో ధ్వంసమైన మైకోలైవ్ పరిపాలనా కార్యాలయం (రాయిటర్స్ ఫొటో)
అదృష్టం అంటే అతడిదే. శత్రుదేశం క్షిపణి దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
కీవ్: అదృష్టం అంటే అతడిదే. శత్రుదేశం క్షిపణి దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అతి నిద్ర కారణంగా కార్యాలయానికి ఆలస్యంగా రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. రష్యా సైనిక దాడి నుంచి ఉక్రెయిన్‌లోని మైకోలేవ్ నగర గవర్నర్ విటాలి కిమ్ సురక్షితంగా తప్పించుకున్నారు.
మైకోలైవ్‌లోని ప్రాంతీయ గవర్నర్ భవనంపై రష్యా మంగళవారం ఉదయం క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 33 మంది గాయపడ్డారు. త్వరగా నిద్రలేవకపోవడంతో విటాలి కిమ్ సమయానికి ఆఫీసుకు రాలేకపోయారు. ఆయన కార్యాలయానికి వచ్చే లోపలే రష్యా దాడికి పాల్పడింది. దీంతో క్షిపణి దాడి నుంచి బయటపడగలిగారు.
మైకోలైవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి రష్యా చేస్తున్న ప్రయత్నాలను గేలి చేస్తూ కార్యాలయంలో విటాలి కిమ్ వీడియాలు రికార్డ్ చేసినట్టు ‘టైమ్స్’వార్త సంస్థ నివేదించింది. రష్యా దాడిలో తన కార్యాలయ భవనం సగం ధ్వంసమైందని విటాలి కిమ్ చెప్పినట్టు టైమ్స్ పేర్కొంది.
ఉక్రెయిన్‌లో వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన మైకోలైవ్ నగర రక్షణ బాధ్యతను విటాలి కిమ్ నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రష్యా దాడులను ఈ నగరం విజయవంతంగా తిప్పికొట్టింది. (క్లిక్: బలగాలు వెనక్కి.. ఆ వెంటనే ట్విస్ట్ ఇచ్చిన రష్యా)