![Narendra Modi expected to address annual UNGA session in person on Sept 25 - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/15/Untitled-6.jpg.webp?itok=F3V13ip4)
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ (జనరల్ అసెంబ్లీ) 76వ ఉన్నత స్థాయి వార్షిక సమావేశానికి భారత ప్రధాని మోదీ ప్రత్యక్షంగా హాజరై ప్రసంగించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఐరాస విడుదల చేసిన వివిధ ప్రభుత్వాధినేతలతో కూడిన తాత్కాలిక మొదటి షెడ్యూల్ జాబితాలో భారత ప్రధాని పేరుంది. ఐరాస షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం ప్రసంగించే నేతల్లో మోదీ పేరు మొదటిది. కాగా, సెప్టెంబర్ 21న అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రసంగించనున్నారు.
అమెరికా అధ్యక్ష హోదాలో ఐరాసలో ఆయన ప్రసంగించడం ఇదే ప్రథమం. సెప్టెంబర్ 14–27వ తేదీల మధ్య జరిగే ఐరాస సమావేశాల్లో 167 దేశాధి నేతలు, ప్రభుత్వాధినేతలు, 29 మంది మంత్రులు, రాయబారులు ప్రసంగిస్తారు. ఇందులో ఇరాన్, ఈజిప్టు, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, నేపాల్ తదితర 46 దేశాల నేతలు వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్ష హోదాలో ఏడాదిపాటు కొనసాగుతారు.
సమావేశాల సమయానికి ఆతిథ్య నగరం న్యూయార్క్ నగరంలో అమలయ్యే కోవిడ్ ప్రొటోకాల్స్‌ను అమలు చేస్తామని ఐరాస సెక్రటరీ జనరల్ గ్యుటెర్రస్ ప్రతినిధి స్టిఫానీ తెలిపారు. ఇందుకు సంబంధించి మొత్తం 193 సభ్య దేశాలతో మాట్లాడతామన్నారు. 2019లో మొదటిసారిగా భారత ప్రధాని మోదీ ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రసంగించారు. గత ఏడాది సర్వప్రతినిధి సభలో ప్రసంగించాల్సిన ప్రధాని మోదీ సహా వివిధ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో రికార్డు చేసిన ప్రసంగాన్ని పంపించారు. ఐరాస 75 ఏళ్ల చరిత్రలో వర్చువల్‌గా ఐరాస ఉన్నత స్థాయి భేటీ జరగడం అదే ప్రథమం.
Comments
Please login to add a commentAdd a comment