ప్యాంగ్‌యాంగ్: ఉక్రెయిన్-రష్యా యుద్దం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తుంటే.. మరోవైపు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ క్షిపణి ప్రయోగాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే ఎనిమిది క్షిపణి ప్రయోగాలు చేసిన నార్త్ కొరియా.. తాజాగా శనివారం మరో ప్రయోగం చేసి ఉద్రిక్తతలను పెంచింది.
వివరాల ప్రకారం.. ప్రపంచదేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఉత్తరకొరియా తన క్షిపణి ప్రయోగాలను ఆపట్లేదు. అణ్వాయుధాల కట్టడిపై 2019లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. అనంతరం అమెరికా, ఉత్తర కొరియా మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ట్రంప్, కిమ్ మధ్య కొన్ని రోజులు మాటల యుద్దం నడిచింది. ఆ తర్వాత ఉత్తరకొరియా మరింత జోరు పెంచింది.
తమ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేలా పలుమార్లు క్షిపణి ప్రయోగాలను చేపడుతూనే ఉంది. కొన్ని నెలలుగా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ వరుస క్షిపణి ప్రయోగాలతో బిజీగా మారిపోయారు. ఈ సంవత్సురంలో ఇప్పటికి తొమ్మిది క్షిపణి ప్రయోగాలు చేపట్టినట్టు దక్షిణ కొరియా వెల్లడించింది. శనివారం ప్రయోగించిన క్షిపణి ప్రయోగంపై జపాన్ రక్షణ శాఖ స్పందిస్తూ.. సముద్రంలోకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్టు తాము భావిస్తున్నామని చెప్పింది. అంతకు ముందు ఫిబ్రవరి 27వ తేదీన నార్త్ కొరియా ఎనిమిదొవ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.
మరోవైపు మార్చి 9వ తేదీన(బుధవారం) దక్షిణ కొరియాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, ఎన్నికల కోసం ప్రెసిడెన్షియల్ బ్లూ హౌస్‌లో జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనున్న క్రమంలో నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం చేపట్టడం ఆందోళనకు గురి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment