తగ్గేదేలే! అంటూ ..ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు..మరో క్షిపణి ప్రయోగం | North Korea Launched 2 Ballistic Missiles Into Its Pacific Firing Range | Sakshi
Sakshi News home page

తగ్గేదేలే! అంటూ ..ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు..48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగం

Published Mon, Feb 20 2023 6:57 PM | Last Updated on Mon, Feb 20 2023 6:57 PM

North Korea Launched 2 Ballistic Missiles Into Its Pacific Firing Range - Sakshi

ఉత్తర కొరియా దూకుడుగా వరుస క్షిపణి ప్రయోగాలకు తెగబడుతోంది. ఒక బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగించిన రెండు రోజుల్లోనే మరో రెండు బాలిస్టిక్‌ కిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ధృవీకరిచింది కూడా. ఎలాంటి హెచ్చరికలు ఖాతరు చేయకుండా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వరుస క్షిపణి ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. వాస్తవానికి ఉత్తర కొరియా గత శనివారమే ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని జపాన్‌ పశ్చిమ తీరంలో ప్రయోగించింది. దీంతో ఆదివారం అమెరికా ఆదివారం దక్షిణ కొరియా, జపాన్‌తోనూ విడిగా ఉమ్మడి వైమానికి విన్యాసాలను నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా సోమవారం తూర్పు తీరంలో రెండు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది.

ఈ క్షిపణులను బహుళ రాకెట్‌ లాంచర్‌తో సుమారు 395 కి.మీ, 337 కి.మీ దూరంలోని లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా పేర్కొంది. ఈ వ్యూహాత్మక అణ్వాయుధం శత్రు ఎయిర్‌ ఫీల్డ్‌ను నిర్వీర్వం చేయగలదని ఉ‍త్తర కొరియా మీడియా వెల్లడించింది. అలాగే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ పసిఫిక్‌ను ఫైరింగ్‌ రేంజింగ్‌ మారుస్తామని హెచ్చరించింది. అంతేగాదు అధిక ఫ్రీక్వెన్సీతో మరిన్ని సైనిక చర్యలకు తెగబడటం అనేది యూఎస్‌ దళాల చర్యలపై ఆదారపడి ఉంటుందని ఆమె గట్టి వార్నింగ్‌ కూడా ఇచ్చారు. మరోవైపు జపాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఉత్తర కొరియా రెండు క్షిపణులను ప్రయోగించిందని, అవి గరిష్టంగా 50 కి.మీ నుంచి 100 కి.మీ ఎత్తుకు చేరుకున్నట్లు తెలిపింది. ఈ పరీక్షల విషయమై అత్యవసర యూఎన్‌ భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చినట్లు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా చెప్పారు.

ఐతే ఉక్రెయిన్‌ సంక్షోభం, అమెరికా గగనతలంలో చైనా నిఘా బెలూన్‌ వ్యవహారం నేపథ్యంలో అమెరికా చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తదితర కారణాల రీత్యా యూఎన్‌ ఆంక్షాలు విధించే అవకాశం తక్కువగా ఉంది. ఇదిలా ఉండగా, దక్షిణ కొరియా మాత్రం ఈ ప్రయోగాలను తీవ్రమైన రెచ్చగొట్టే చర్యగా పేర్కొంది. వెంటనే ఇలాంటి వాటిని నిలిపివేయాలని ఉత్తర కొరియాను హెచ్చరించింది. అలాగే ప్రతిఘటనలపై చర్చించడానికి జాతీయ భద్రత మండలి సమామేశాన్ని నిర్వహించనున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్‌ యోల్‌ కార్యాలయం తెలిపింది. అంతేగాదు ఉత్తర కొరియా ఆయుధ కార్యక్రమాలకు సంబంధించి నలుగురు వ్యక్తులను, ఐదు సంస్థలపై ఆంక్షలను ప్రకటించింది.

పైగా దీన్ని ఉ‍త్తర కొరియా కవ్వింపు చర్యలకు ప్రతిస్పందనగా పేర్కొంది దక్షణ కొరియా. కచ్చితంగా దీనికి తగిన పర్యవసానాన్ని ఎదుర్కొనక తప్పదంటూ హెచ్చరించింది. దీని గురించి అమెరికా, జపాన్‌తోనూ చర్చిస్తానని దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, యూఎన్‌ ప్రతినిధి స్టెఫాన్‌ డుజారిక్‌ భద్రతా మండలి తీర్మానాలు ప్రకారం నిషేధించిన కవ్వింపు చర్యలను నిలిపేయాలని, అణ్వాయుధీకరణపై చర్చలు పునఃప ‍ప్రారంభించాలని ఉత్తర కొరియాను కోరారు. 
 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement