ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాన్ని టీవీలో వీక్షిస్తున్న దక్షిణ కొరియా ప్రజలు
సియోల్: అమెరికా, దక్షిణకొరియాలను కవ్వించేందుకు యత్నిస్తున్న ఉత్తరకొరియా ఆదివారం భారీ క్షిపణి ప్రయోగం జరిపింది. బైడెన్ అధ్యక్షుడైన తర్వాత ఉత్తరకొరియా ఈ స్థాయి ప్రయోగం జరపడం ఇదే మొదటిసారి. దీంతో ఒక్క జనవరిలోనే ఈ దేశం ఏడు క్షిపణి పరీక్షలు జరిపినట్లయింది. దాదాపు 2వేల కిలోమీటర్ల ఎత్తును చేరుకొని, 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అనంతరం ఈ క్షిపణి సముద్రంలో కూలింది.
ఈ ప్రయోగాన్ని అమెరికా, జపాన్, దక్షిణ కొరియా ఖండించాయి. 2017 తర్వాత దీర్ఘస్థాయి క్షిపణిని ఉత్తరకొరియా పరీక్షించడం ఇదే తొలిసారి. ఐరాస విధించిన ఆంక్షలను ఖాతరు చేయకుండా ఉత్తరకొరియా మిసైల్ పరీక్షలు నిర్వహిస్తోంది. తమపై విధించిన ఆంక్షలు తొలగించి చర్చలు పునఃప్రారంభించేలా బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఉత్తరకొరియా ఈ చర్యలకు పాల్పడుతోందని నిపుణులు భావిస్తున్నారు. సైనిక శిక్షణ, రాజకీయంగా అమెరికాను ఇరుకున పెట్టడం, కొత్త సిస్టమ్స్ ఇంజినీరింగ్ అవసరాలు, విదేశాలకు విక్రయించేలా ప్రచారం కోసం, ఇంజినీరింగ్ సిస్టమ్స్ పరీక్షల కోసం ఈ ప్రయోగాలు చేస్తున్నారని అంచనా వేస్తున్నారు.
అయితే దేశ సైనిక శక్తిని బలోపేతం చేయడానికి ఈ పరీక్షలని ఉత్తరకొరియా అధినేత కిమ్ ప్రకటించారు. ఉత్తరకొరియా చర్యలపై చర్చకు వెంటనే భద్రతామండలి సమావేశం ఏర్పాటు చేయాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయ్‌ఇన్ పిలుపునిచ్చారు. పరిస్థితులన్నీ తిరిగి 2017లో ఉన్న వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కిమ్ ఈ చర్యలకు స్వస్తిపలకాలని కోరారు. చర్యను ఖండించిన యూ ఎస్ మాత్రం ఈ చర్య తమకు, తమ మిత్రులకు ప్రమాదకరం కాదని వ్యాఖ్యానించింది. చైనాలో ఒలంపిక్స్ పూర్తైన తర్వాత ఉత్తరకొరి యా దూకుడు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment