జెనీవా: వినికిడి సమస్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సంచలన విషయాలను వెల్లడించింది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరికి వినికిడి సమస్య ఉంటుందని తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదుగురిలో ఒకరికి ప్రస్తుతం వినికిడి సమస్యలున్నాయని తాజా నివేదికలో తెలిపింది. కానీ "రాబోయే మూడు దశాబ్దాలలో వీరి సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ కావచ్చని డబ్ల్యూహెచ్‌వో మంగళవారం హెచ్చరించింది. 2019లో వినికిడి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 160 కోట్లుగా ఉండగా, రానున్న మూడు దశాబ్దాల్లో ఈ సంఖ్య 250 కోట్లకు చేరనుందని హెచ్చరించింది. నివారణ, చికిత్సలో అదనపు పెట్టుబడులు పెట్టాలని ప్రపంచదేశాలకు పిలుపు నిచ్చింది. వినికిడి సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించడంలో ప్రపంచదేశాలు వైఫల్యం చెందుతుండటం వల్ల ప్రతి ఏడాది ట్రిలియన్ డాలర్లు కోల్పోతున్నట్టు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ అంచనా వేశారు.
వినికిడిపై మొట్టమొదటి ప్రపంచ నివేదిక ప్రకారం, అంటు వ్యాధులు, శబ్ద కాలుష్యం, మానవ జీవనశైలిలో వచ్చిన మార్పులే వినికిడి సమస్యలకు కారణమని తెలిపింది. అయితే అంటువ్యాధులు, జన్యుపాలు, భారీ శబ్దాలు లాంటి వాటిని నివారించవచ్చని తెలిపింది. దీని చికిత్స కోసం డబ్ల్యూహెచ్ఓ ప్యాకేజీని కూడా ప్రతిపాదించింది. ప్రతి సంవత్సరం కొన్ని ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నప్పటికి వినికిడి సమస్యను నివారించలేకపోయామని డబ్ల్యూహెచ్ఓ వివరించింది. తాము అంచనా వేసినట్టుగా 250 కోట్ల మందిలో 70 కోట్ల మందికి సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని, వారికి చికిత్స తప్పనిసరని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో భారీ శబ్దాలను నివారించడంతో పాటు, వినికిడి లోపం కలిగించే మెనింజైటిస్ వంటి వ్యాధులకు టీకాలు పెంచడం లాంటి ప్రజారోగ్య కార్యక్రమాలతో సహా, భారీ ప్యాకేజీని ప్రతిపాదించింది. అలాగే క్రమబద్ధమైన స్క్రీనింగ్‌ను కూడా సిఫారసు చేసింది. తద్వారా పిల్లల్లో, 60 శాతం కేసులలో వినికిడి లోపాన్ని నివారించవచ్చని నివేదించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రతిపాదన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తికి సంవత్సరానికి సగటున 1.33 డాలర్ల(రూ. 97.67) ఖర్చు అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment