ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ నూతన పీఎం షెహబాజ్ షరీఫ్ ఆదివారం లేఖ రాశారు. ఈ లేఖలో భారత్‌తో శాంతియుత సంబంధాలు, కశ్మీర్ సహా అపరిష్క్రత సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
అయితే, పాక్‌లో అవిశ్వాస తీర్మానం తర్వాత ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఓ లేఖలో భారత ప్రధాని మోదీ.. షెహబాజ్ షరీఫ్‌కు అభినందనలు తెలిపారు. ఆ లేఖలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. కాగా, ఈ లేఖపై పాక్ ప్రధాని స్పందిస్తూ.. శుభాకాంక్షలు తెలిపినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. భారత్‌తో పాకిస్తాన్ శాంతియుత, సహకార సంబంధాలను కోరుకుట్టున్నట్టు తెలిపారు.
అలాగే, జమ్ముకశ్మీర్‌తో సహా ఇతర వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ త్యాగం అందరికీ తెలిసిందేనని అన్నారు. శాంతి కోసం పాటుపడాలని అన్నారు. సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక, ఆర్థికాభివృద్ధి గురించి ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిన అవసరముందని షెహబాజ్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. పుల్వామా ఉగ్రదాడికి ప్రతి స్పందనగా 2019లో పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల తర్వాత భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అనంతరం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో ప‍్రధాని నరేంద్ర మోదీ.. పాకిస్తాన్‌తో భారత్ నిర్మాణాత్మక సంబంధాలను కోరుకుంటోందని ఇటీవలే స్పష్టం చేశారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment