జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే దారుణ హత్యతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గన్ కల్చర్, రాజకీయ హింసలు పెద్దగా పరిచయంలేని దేశంలో.. అదీ షింజోలాంటి నేత మీద ఈ తరహా దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన సమర్థవంతమైన సంస్కరణలతో జపాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోనే ఆయన ఆగిపోలేదు. అమెరికా సహకారం లేకుండానే రక్షణ వ్యవస్థను పటిష్టపర్చుకునే స్థాయికి నిప్పన్(జపాన్)ను తీసుకురాగలిగారు ఆయన. పొరుగు దేశాలతోనూ మైత్రి, దౌత్యం విషయంలో ఆయనెంతో చాకచక్యంగా వ్యవహరించేవారు. అయితే..
ఆయన మరణ వార్త విని ప్రపంచ దేశాల అధినేతలు, ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే చైనాలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శత్రువు ఇక లేడంటూ సంబురాల్లో మునిగిపోయారు కొందరు చైనా పౌరులు. ఈ మేరకు సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నారు. కాల్పులు జరిపిన దుండగుడిని యాంటీ జపాన్ హీరోగా అభివర్ణిస్తూ పోస్టులు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. చైనా యూజర్ల చేష్టలను వెలుగులోకి తెచ్చిన కొందరు ఆ దేశ ప్రజలే.. ఇది దుర్మార్గమంటూ కామెంట్లు చేస్తున్నారు. సభ్యతగా వ్యవహరించాలని.. చనిపోయిన వాళ్ల విషయంలో ఇలా చేయడం సరికాదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
వెయిబో, వీచాట్‌లో ఇప్పుడు దుర్మార్గమైన కామెంట్లు కనిపిస్తున్నాయి. షింజో అబేపై జోకులు పేల్చుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఇంకొందరైతే జాన్ ఎఫ్ కెనడీ హత్యోదంతంతో పోలుస్తూ.. ఆనందిస్తున్నారు. 1937, జూలై7న చైనాపై జపాన్ పూర్తి స్థాయి దండయాత్ర చేసిన మార్కో పోలో బ్రిడ్జ్ సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు.
జపాన్-చైనా సరిహద్దుల వెంట ఉద్రిక్త వాతావరణ ఏండ్ల తరబడి కొనసాగుతోంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ విషయంలోనూ పోటీ నడుస్తోంది. అదే సమయంలో ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మాత్రం మెరుగ్గానే కొనసాగుతున్నాయి. భారత్, తైవాన్‌లతో షింజో అబే మంచి సంబంధాలు కొనసాగించడం చైనాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. పైగా చైనాను శక్తివంతమైన దేశంగా ఎదగనీయకుండా భారత్, ఆస్ట్రేలియా, అమెరికాలతో కలిసి క్వాడ్ ఏర్పాటుకు కృషి చేశాడని రగిలిపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచే షింజో అబేతో స్నేహం ఉంది. ఇలా చాలా విషయాలు షింజో అబేపై చైనా వ్యతిరేకతకు కారణం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment