అమెరికా వైమానికదళ విమానం(ఫొటో: AFP)
Last US Troops Leave Afghanistan: సుదీర్ఘ కాలంగా అఫ్గనిస్తాన్‌లో సేవలు అందిస్తున్న అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ పూర్తైంది. అగ్రరాజ్య రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. యూఎస్ జనరల్ కెన్నెత్ మెకాంజీ వాషింగ్టన్ టైమ్‌తో మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, అమెరికా పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తైందని ప్రకటన చేస్తున్నా. సెప్టెంబరు 11, 2001 నుంచి దాదాపు 20 ఏళ్లుగా అఫ్గన్‌లో చేపట్టిన ఆపరేషన్ ముగిసింది’’ అని పేర్కొన్నారు. హమీద్ కర్జాయి ఎయిర్‌పోర్టు నుంచి సీ-17 విమానం బయల్దేరడంతో బలగాల ఉపసంహరణ ముగిసిందన్నారు.
స్వాతంత్ర్యం వచ్చింది: తాలిబన్లు
అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఆగష్టు 31లోగా బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికాకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... మంగళవారం తెల్లవారుజామున అమెరికా జవాన్లు, పౌరులను తరలిస్తున్న చివరి విమానం బయల్దేరిన తర్వాత గాల్లోకి కాల్పులు జరిపి తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు.
దేశ చరిత్రలో ఇదొక కీలక మార్పు అంటూ సంతోషంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా తాలిబన్ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ... ఈరోజు తమకు సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించిందని పేర్కొన్నారు. స్వేచ్ఛ లభించిందన్నారు. ఇక తాలిబన్ అధికారి అనాస్ హక్కాని.. ‘‘చారిత్రాత్మక క్షణాలు. ఎంతో గర్వంగా ఉంది’’ అని హర్షం వ్యక్తం చేశారు. కాగా బలగాల ఉపసంహరణతో అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదంపై అమెరికా చేసిన 20 ఏళ్ల యుద్ధం ముగిసింది.
73 విమానాలు ధ్వంసం
అమెరికా బలగాలు కాబూల్ నుంచి స్వదేశానికి వెళుతూ వెళుతూ విమానాశ్రయంలోని హ్యాంగర్‌లో ఉన్న 73 యుద్ధ విమానాలు, సాయుధ వాహనాలు, రాకెట్ డిఫెన్స్ సిస్టమ్‌ని ధ్వంసం చేశాయి. అక్కడి 73 విమానాలను ముందు జాగ్రత్త పడుతూ ఎందుకూ పనికి రాకుండా చేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ కెన్నెడ్ మెక్‌కెంజీ చెప్పారు. 70 ఎంఆర్‌ఏపీ ఆయుధాలు కలిగిన వాహనాలు వదిలి వెళ్లారు. ఆ ఒక్కొక్క వాహనం ఖరీదు 10 లక్షల డాలర్ల వరకు ఉంటుంది. చివరి విమానం బయల్దేరగానే తాలిబన్లు ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment