మా వ్యాక్సిన్‌తో 90శాతం ఫలితాలు.. | Pfizer and BioNTech say Covid vaccine is more than 90percent effective | Sakshi
Sakshi News home page

మా వ్యాక్సిన్‌తో 90శాతం ఫలితాలు..

Published Tue, Nov 10 2020 4:20 AM | Last Updated on Tue, Nov 10 2020 11:23 AM

Pfizer and BioNTech say Covid vaccine is more than 90percent effective - Sakshi

న్యూయార్క్‌: కరోనాను ఎదుర్కోవడానికి అమెరికాకు చెందిన ఫైజర్‌ కంపెనీ, యూరోప్‌కు చెందిన బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ 90 శాతం ప్రభావవంతంగా పని చేస్తోందని ఆ కంపెనీ సీఈఓ ఆల్బర్ట్‌ బౌర్లా చెప్పారు. తమ ఫలితాలు తెలిసిన నేటి రోజు సైన్సుకూ, మానవాళికి చాలా మంచి రోజు అని అభిప్రాయపడ్డారు. మూడో దశ ప్రయోగం వల్ల తమ వ్యాక్సిన్‌ కరోనాను అడ్డుకుంటోందని తెలుస్తోందని చెప్పారు. ప్రపంచానికి అత్యవసరమైన కరోనా వ్యాక్సిన్‌ త్వరలోనే తమ నుంచి వచ్చే వకాశం ఉందని తెలిపారు.

బయోఎన్‌టెక్‌ సీఈఓ ఉగుర్‌ సాహిన్‌ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ రూపంలో దాడి చేస్తున్న నేపథ్యంలో ఈ ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని చెప్పారు. ఫైజల్, బయోఎన్‌టెక్‌ కంపెనీలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జూలై 27న ప్రారంభమైంది. మొత్తం 38,955 మందికి నవంబర్‌ 8 నాటికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. రెండో, మూడో దశ ప్రయోగాల్లో వచ్చిన వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించినట్లు తెలిపాయి.  అయితే, పరిశీలన పూర్తయ్యే నాటికి ఈ డేటా మారే అవకాశం ఉందని ఫైజర్‌ కంపెనీ ఉపాధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ఈ యేడాది చివరి నాటికి టీకా వచ్చే అవకాశాలున్నాయన్నారు.  

ఫైజర్‌ భారత్‌కు వచ్చేనా ?
తాజా పరిణామంతో ఫైజర్‌ టీకాను భారత్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయస్తున్నారు. ఇప్పటికే కోవిడ్‌ జాతీయ నిపుణుల బృందం ఫైజర్‌ ప్రతినిదులను కలసి చర్చించినట్లు సమాచారం. భారత్‌లో దీన్ని డెలివరీ చేయించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను ఈ బృందం పరిశీలిస్తోంది.

45 వేల కేసులు..
భారత్‌లో గత 24 గంటల్లో 45,903 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,53,657కు చేరుకుంది. గత 24 గంటల్లో 490 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 1,26,611. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 79,17,373కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 5,09,673 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన 9 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, అధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ సమీక్ష జరిపారు.

అమెరికాలో ఆగమేఘాలపై టీకా తయారీ
సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో ట్రంప్‌  అధికారంలోంచి దిగిపోయేందుకు ముందుగానే ఓ అద్భుతాన్ని సృష్టించనున్నారా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఎఫ్‌డీఏ అనుమతి రాకమునుపే కోట్లాది కోవిడ్‌–19 టీకాలు ఫ్యాక్టరీల్లో సిద్ధమైపోతున్నాయి. ‘‘ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్‌’’ కోవిడ్‌ టీకా తయారీని వేగవంతం చేసేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమం పేరు ఇది. అమెరికన్‌ పౌరులు 30 కోట్ల మందికి టీకా అందించే లక్ష్యంతో మొదలైన ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్‌కు నేతృత్వం వహించింది ఓ ఆర్మీ జనరల్‌. ఈ ఏడాది మేలోనే రిటైర్‌ కావాల్సిన ఓ ఆర్మీ జనరల్‌! పేరు గస్‌ పెర్నా. టీకా తయారీకి సంబంధించిన వీడియోలు సీబీఎస్‌ టీవీ ప్రసారం చేయడంతో ఇప్పుడు గస్‌ పెర్నా పేరు మారుమోగిపోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement