
వాషింగ్టన్:కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోదీ తొలిసారి అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఫిబ్రవరిలో మోదీ అమెరికా వెళ్లే అవకాశాలున్నాయి.ఈ పర్యటనపై ట్రంప్,మోదీ మధ్య ఫోన్‌లో చర్చ జరిగినట్లు వైట్‌హౌజ్ సోమవారం(జనవరి27) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ, ట్రంప్‌కు ఫోన్ చేసి అభినందించారు.ఈ సందర్భంగా వారిరువురి మధ్య ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే క్వాడ్ సదస్సు కూడా చర్చలో ప్రస్తావనకు వచ్చింది.
మిడిల్ ఈస్ట్, యూరప్‌లో ప్రస్తుత పరిస్థితులపైనా ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.కాగా, భారత్ సభ్య దేశంగా ఉన్న బ్రిక్స్ కూటమిలోని దేశాలపై 100 శాతం దిగుమతి సుంకం విధిస్తానని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. దీనికి తోడు ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానంపైన భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.