మోదీ, డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సన్
న్యూఢిల్లీ: గ్లోబల్ సప్లయ్ చైన్ కేవలం ఒకే ఒక్క వనరుపైనే అధికంగా ఆధారపడి ఉండటం ఎంత ప్రమాదకరమో కోవిడ్ తెలియజెప్పిందని ప్రధాని మోదీ అన్నారు. డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సన్‌తో మోదీ సోమవారం వర్చువల్ విధానంలో ద్వైపాక్షిక సమావేశం జరిపారు. ఈ క్లిష్ట సమయంలో గ్లోబల్ సప్లయ్ చైన్‌ను ఒకే దేశానికి బదులు అనేక దేశాలకు విస్తరించుకునే క్రమంలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలతో భారత్ పనిచేస్తోందనీ, భావసారూప్యం గల దేశాలను ఆహ్వానిస్తోందని మోదీ వివరించారు.
గత కొద్ది నెలలుగా సంభవిస్తున్న పరిణామాలు పారదర్శకత, ప్రజాస్వామ్య వ్యవస్థ, నియమాల ఆధారంగా ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని చాటిచెప్పాయని పేర్కొన్నారు. అధికార గణాంకాల ప్రకారం.. భారత్–డెన్మార్క్ ద్వైపాక్షిక వాణిజ్యం 2016–2019 సంవత్సరాల్లో 2.82 బిలియన్ డాలర్ల నుంచి 3.68 బిలియన్ డాలర్లకు పెరిగింది. సుమారు 200 డెన్మార్క్ కంపెనీలు దేశంలో నౌకాయానం, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. డెన్మార్క్ కంపెనీల్లో 5వేల మంది భారతీయ నిపుణులు పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment