వాషింగ్టన్ రాష్ట్రంలోని స్పోకేన్ సిటీలో మంచును తొలగిస్తున్న స్థానికులు
టెక్సాస్: అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలను మంచు ముంచేస్తోంది. భారీగా కురుస్తున్న మంచుతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. విమానాలను రద్దు చేశారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి వీల్లేకుండా రహదారులన్నీ మంచుతో కప్పేసి ఉన్నాయి. దాదాపుగా 15 కోట్ల మంది అమెరికన్లకి మంచు ముప్పులో ఉన్నట్టుగా ది నేషనల్ వెదర్ సర్వీసెస్ హెచ్చరించింది. టెక్సాస్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో 40 లక్షల మందికిపైగా అమెరికన్లు నీళ్లు, కరెంట్ లేక అల్లాడిపోతున్నారు. టెక్సాస్, అలబామా, ఒరెగాన్, ఒక్లహోమా, కాన్సస్, కెంటకీ, మిసిసిపీ రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. టెక్సాస్‌లో పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది. విద్యుత్ ప్లాంట్లు సరిగా పని చేయడం లేదు. పైపుల్లో నీరు గడ్డ కట్టుకపోవడంతో ప్రజలు నీళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు.
టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ నేషనల్ గార్డ్ సాయం కోరారు. కన్సాస్ గవర్నర్ కరెంట్ పొదుపుగా వాడుకోవాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఇక కెంటకీలో మరింత బలంగా చలి గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలన్నీ పాటించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఇప్పటికీ 27 లక్షల మందికిపైగా ప్రజలు చీకట్లోనే మగ్గిపోతున్నారు. లూసియానా, డల్లాస్ రాష్ట్రాల్లోనూ మంచు బీభత్సం నెలకొంది. ఆర్కిటిక్ నుంచి వీస్తున్న బలమైన చలిగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. నార్త్ కరోలినాలో టోర్నడోలకు ముగ్గురు మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment