సాల్ట్‌లేక్ సిటీలో కారుపై మంచును తొలగిస్తున్న మహిళ
పియెర్రె: అమెరికాను భీకర మంచు తుపాను వణికిస్తోంది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోయాయి. వందలాది నివాసాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. విమాన సర్వీసులు రద్దయ్యాయి. స్కూళ్లు మూతబడ్డాయి. వాతావరణ విభాగం 1989 తర్వాత మొదటిసారిగా మంచు తుపాను (బ్లిజ్జార్డ్) హెచ్చరికలను జారీ చేసింది. కొన్ని తీర ప్రాంతాల్లో అలలు 3 నుంచి 4.3 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి.
తుపాను తీవ్రత దృష్ట్యా సుమారు 24 రాష్ట్రాల్లోని 6.5 కోట్ల మంది ప్రజలకు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. వ్యోమింగ్, ఆరిజోనా, న్యూ మెక్సికో, పోర్ట్‌ల్యాండ్, ఓరెగాన్ పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్ప డింది. మిషిగన్, ఇలినాయీ, కాలిఫోర్నియా ల్లో విద్యుత్ లైన్లు తెగిపోవడంతో జనం రాత్రిళ్లు చీకట్లోనే గడిపారు. మంచు, చలిగాలులతో కాలిఫోర్నియా, సియెర్రా నెవడాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
సుమారు 1,800 విమాన సర్వీసులు రద్దు కాగా, మరో 6 వేలకు పైగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇలా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఇందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. నాష్‌విల్లేలో బుధవారం అత్యధికంగా 26.67 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై 127 ఏళ్ల రికార్డు బద్దలైందని అధికారులు చెప్పారు. ఇండియానా పొలిస్, సిన్సినాటి, అట్లాంటా, లెక్జింగ్టన్, కెంటకీ, అలబామాల్లోనూ ఇదే స్థాయిలో ఎండలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment