మాస్కో: మధ్య ఆసియా దేశమైన కజకిస్తాన్‌లో ఎల్‌పీజీ గ్యాస్ ధరల్ని భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. దేశంలోని అతి పెద్ద నగరమైన అల్మటీలో నిరసనకారులు ప్రభుత్వ భవనాలపై జరిపిన దాడులు రక్తపాతాన్ని సృష్టించాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందగా, 12 మంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు.
ఒక పోలీసు అధికారి తల తెగి రోడ్డుపై పడి ఉండడం భయోత్పాతాన్ని రేపింది. అత్యవసర పరిస్థితుల్ని తోసిరాజని బుధవారం రాత్రికి రాత్రి ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి అధ్యక్ష భవనం, ఇతర ప్రభుత్వ భవనాలను ముట్టడించడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పోలీసు శాఖ పోలీస్ శాఖ తెలిపింది.
కజకిస్తాన్ ప్రజలు ఎల్‌పీజీ గ్యాస్‌ని ఎక్కువగా కార్లలో వినియోగిస్తారు. ఎలక్ట్రానిక్ వాహనాలు వినియోగించాలన్న ఉద్దేశంతో పెట్రో ధరలపై ప్రభుత్వం సబ్సిడీలను ఎత్తేయడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు గత ఆదివారం నుంచి నిరసనలకి దిగారు. పరిస్థితులు చెయ్యి దాటిపోతూ ఉండడంతో టోకయేవ్ రష్యా సాయాన్ని కోరారు. ఆయన అభ్యర్థన మేరకు రష్యా, దాని మిత్ర దేశాలు కజకిస్తాన్‌కు శాంతి బలగాలను పంపించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment