న్యూయార్క్ : 'ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది.. నా వీపుకు తగిలిన గాయాలు నన్ను బాధిస్తున్నాయి.. రోజులో ఉండే 24 గంటలు కేవలం నొప్పిని మాత్రమే గుర్తు చేస్తున్నాయి.. అయినా సరే నాకు బతకాలనిపిస్తుంది.. ఎందుకంటే నేను జీవితంలో సాధించాల్సి చాలా ఉంది.. అంటూ జాకబ్ బ్లాక్ అనే నల్ల జాతీయుడు షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
అమెరికాలో జాతి వివక్ష గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాలుగా నల్లజాతీయులు అక్కడి తెల్ల జాతీయుల చేతిలో జాత్యంహకారానికి బలవుతూనే ఉన్నారు. జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం అమెరికాను అట్టుడికేలా చేసింది. ఇప్పటికి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా నల్ల జాతీయులపై దాడులు ఆగడం లేదు. (చదవండి : మరో నల్లజాతీయుడిని కాల్చి చంపిన పోలీసులు)
ఇదే కోవలో ఆగస్టు 23న విస్కాన్‌సిన్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కెనోషా అనే ప్రాంతంలో 29 ఏళ్ల జాకబ్ బ్లేక్స్ అనే వ్యక్తి ఇంటికి వెళదామని తన కారు దగ్గరకు వచ్చాడు. ఇంతలో తెల్లజాతీయులైన ఇద్దరు పోలీసులు వచ్చి జాకబ్ బ్లేక్‌ను అడ్డుకొని ఏదో అడిగారు. ఆ తర్వాత అతన్ని కిందపడేసి విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం తుపాకీతో ఏడు నుంచి ఎనిమిది బులెట్లను జాకబ్ వీపులోకి కాల్చారు. బులెట్ల దాటికి అతని శరీరం చిద్రమైంది. ఆ సమయంలో జాకబ్ ముగ్గురు పిల్లలు కారులోనే ఉన్నారు. క్షణాల్లో చోటుచేసుకున్న ఈ ఉదంతంతో అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. వెంటనే బ్లేక్‌ను ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం జాకబ్ బ్లేక్ కదల్లేని స్థితిలో పడి ఉన్నాడు. బులెట్ల దాటికి వీపు భాగం మొత్తం దెబ్బతింది. బ్లేక్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆసుపత్రి బెడ్‌పై నుంచే ప్రపంచానికి తన బాధను చెప్పుకోవాలని బ్లేక్ అనుకున్నాడు. డాక్టర్ల సహాయంతో తన మాటలను ఒక వీడియో రూపంలో విడుదల చేశాడు.
'నాకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది... 24 గంటలు నొప్పిని మాత్రమే చూస్తున్నా.. తిండి తినాపించడం లేదు.. నిద్ర రావడం లేదు.. జీవితం చాలా విలువైనది.. అందుకే నేను బతకాలి.. నా కుటుంబసభ్యులను కలుసుకోవాలి.. అందుకే ఒకటి చెప్పదలచుకున్నా.. మీ జీవితాలను మార్చుకోండి... ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేం.. బతికినంత కాలం డబ్బు సంపాధించడంతో పాటు మనుషులను ప్రేమించడం అలవాటు చేసుకోండి.. ఇవన్నీ ఇప్పుడు నేను అనుభవించే స్థితిలో లేను' అంటూఉద్వేగంతో చెప్పుకొచ్చాడు.(చదవండి : నావల్నీ విషప్రయోగం కేసుపై రష్యా స్పందన)
జాకబ్ బ్లేక్ పలికిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్లేక్‌కు మద్దతుగా విస్కాన్‌సిన్ నగరంలో పౌరులు ఆందోళనలు చేస్తున్నారు. బ్లేక్‌కు న్యాయం జరగాలంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే జాకబ్‌ను కాల్చిన పోలీసులను విస్కాన్‌సిన్ సిటీ పోలీస్ విధుల నుంచి తొలగించింది. సస్పెండ్ చేస్తే చాలదని.. వారికి తగిన శిక్ష వేయాలంటూ అక్కడి ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment