ఖెర్సన్‌లో ఉక్రెయిన్ సైనికున్ని ఆనందంతో ఆలింగనం చేసుకుంటున్న ఓ యువతి
మైకోలైవ్ (ఉక్రెయిన్): ఖెర్సన్ నుంచి రష్యా వైదొలగడాన్ని ఉక్రెయిన్ పండుగ చేసుకుంటోంది. ఆ ప్రాంత వాసులంతా తమ సైనికులను హర్షాతిరేకాల నడుమ స్వాగతిస్తూ వారిని ఆలింగనం చేసుకుంటూ, ముద్దులు పెట్టుకుంటున్నారు. ఖెర్సన్‌లో నగరమంతా కలియదిరుగుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఈ విజయోత్సాహాన్ని ఇలాగే కొనసాగిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు. ‘‘రష్యా సేనలను దేశమంతటి నుంచీ తరిమేసి తీరతాం. అనేక ప్రాంతాల్లో మా సేనలకు సొంత పౌరుల నుంచి త్వరలో ఇలాంటి మరెన్నో స్వాగతాలు లభించనున్నాయి’’ అన్నారు.
పడిపోయిన కరెంటు స్తంభాలు, ధ్వంసమైన తాగునీరు తదితర మౌలిక వసతులు. ఎక్కడ పడితే అక్కడ మృత్యుఘంటికలు విన్పిస్తున్న మందుపాతరలు. ఇవీ... ఖెర్సన్‌కు వెళ్లే ప్రాంతాల్లో దారి పొడవునా కన్పిస్తున్న దృశ్యాలు. రష్యా సేనల విధ్వంసకాండకు ఇవి అద్దం పడుతున్నాయి. నగరవాసులు తిండి, నీరు, మందులకు అల్లాడుతున్నారు. పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఉక్రెయిన్ అధికార వర్గాలు శాయశక్తులా శ్రమిస్తున్నాయి. మరోవైపు ఖెర్సన్ బాటలోనే ఖఖోవా జిల్లా నుంచి కూడా రష్యా తప్పుకుంటోంది. అక్కడి నుంచి తమ అధికారులు తదితరులను మొత్తంగా వెనక్కు పిలిపిస్తున్నట్టు స్థానిక రష్యా పాలక వర్గం పేర్కొంది. ఉక్రెయిన్ దాడులకు లక్ష్యం కారాదనే ఈ చర్య తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment