లండన్: అసంఖ్యాక అభిమానుల అశ్రు నివాళుల నడుమ బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్–2 అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. కార్యక్రమం ఆసాంతం పూర్తి ప్రభుత్వ లాంఛనాల నడుమ సాగింది. రాచ కుటుంబీకుల అంతిమయాత్రకు ఉపయోగించే ప్రత్యేక వాహనంలో రాణి పార‍్థివ దేహాన్ని ఉదయం 11 గంటలకు వెస్ట్‌మినిస్టర్ హాల్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలించారు. రాజు చార్లెస్–3తో పాటు ఆయన తోబుట్టువులు, కొడుకులు, కోడళ్లు, మనవడు, మనవరాలు, ఇతర రాజకుటుంబీకులు వెంట నడిచారు. అబేలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులతో పాటు 2,000 మందికి పైగా దేశాధినేతలు, రాజులు, ప్రముఖులు చివరిసారిగా నివాళులర‍్పించారు.
నేపథ్యంలో విషాద సంగీతం వినిపిస్తుండగా గంటకు పైగా ప్రార్థనలు కొనసాగాయి. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తదితరులంతా బైబిల్ వాక్యాలు పఠించారు. ఈ సందర్భంగా రాణికి నివాళిగా బ్రిటన్‌వ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. వెస్ట్‌మినిస్టర్ డీన్ తదితరులు శోక సందేశం వినిపించారు. దేశసేవకు జీవితాన్ని అంకితం చేస్తానంటూ రాణి తన 21వ పుట్టినరోజున చేసిన ప్రతిజ్ఞను ఆసాంతం నిలబెట్టుకున్నారంటూ కొనియాడారు. అనంతరం ఎలిజబెత్–2 వివాహ, పట్టాభిషేక వేడుకలకు వేదికగా నిలిచిన వెస్ట్‌మినిస్టర్ అబే నుంచే ఆమె అంతిమయాత్ర మొదలైంది. చారిత్రక లండన్ వీధుల గుండా భారంగా సాగింది. ఈ సందర్భంగా ఇరువైపులా అభిమానులు అసంఖ్యాకంగా బారులు తీరారు. తమ అభిమాన రాణికి శోకతప్త హృదయాలతో తుది వీడ్కోలు పలికారు.
రాణికి తుది నివాళులర్పిస్తున్నరాష్ట్రపతి ముర్ము, పలు దేశాధినేతలు
దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై లక్షలాది మంది అంతిమయాత్రను వీక్షిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. 96 ఏళ్లు జీవించిన రాణికి నివాళిగా లండన్లోని చారిత్రక బిగ్‌బెన్ గడియారం నిమిషానికోసారి చొప్పున 96 సార్లు మోగింది. హైడ్ పార్కులో రాయల్ గన్ సెల్యూట్ నిరంతరాయంగా కొనసాగింది. అనంతరం రాణి పార‍్థివ దేహాన్ని జాతీయ గీతాలాపన నడుమ దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని చారిత్రక విండ్సర్ కోటకు ప్రత్యేక వాహనంలో తరలించారు. శవపేటికపై ఉంచిన రాజ చిహ్నాలైన కిరీటం తదితరాలను తొలగించారు. సంప్రదాయ ప్రార్థనల అనంతరం సెయింట్ జార్జి చాపెల్‌కు తరలించారు. రాజ కుటుంబీకుల సమక్షంలో రాణి తల్లిదండ్రులు, భర్త, సోదరి సమాధుల పక్కనే ఖననం చేశారు. బ్రిటన్‌ను అత్యధిక కాలం పాలించిన రాణి పవిత్రాత్మ పరలోకంలోని ప్రభువును చేరాలంటూ బైబిల్ వాక్యాల పఠనం తర్వాత మరోసారి జాతీయ గీతాలాపనతో అంత్యక్రియలు ముగిశాయి.
క్వీన్ విక్టోరియా మెమొరియల్ మార్గం గుండా సాగుతున్న రాణి అంతిమయాత్ర
ఇదీ చదవండి: బ్రిటన్ రాజు బాడీగార్డులకు నకిలీ చేతులు! నెటిజన్ల అయోమయం
Comments
Please login to add a commentAdd a comment