
జారినా నిలబడిన రోబోట్
నెటిజన్ల సరదా స్పందనలు
ఫూటుగా తాగిన వ్యక్తి చెరువు గట్టు దిగుతుంటే తూలి పడటం సహజం. ఒకవేళ తూలిపడబోతుంటే తమాయించుకుని నిలబడగలిగితే భలేగా నిలబడ్డాడే అని పక్కన ఉన్నవాళ్లు నవ్వుకుంటూ మెచ్చుకోవడం సహజం. మానవులకు సాధ్యమయ్యే ఇలాంటి పనిని మరమనిషి సైతం సాధించి చూపించింది. మట్టిగట్టుపై నడుస్తూ కాలిజారి గబాలున పడబోతూ రోబోట్ వెంటనే తమాయించుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం అధునాతన రొబోటిక్ సాంకేతికరంగంలో పెద్ద చర్చనీయాంశమైంది. మనిషికి సాధ్యమయ్యే అసంకల్పిత ప్రతీకార చర్యలు మరమనుషులకు సాధ్యమా? అనే చర్చ మొదలైంది. అయితే వీడియో చూసిన వాళ్లలో కొందరు నవ్వు తెప్పించే కామెంట్లు పెట్టారు.
‘‘హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ మనిషిలాగే నడవగలిగే సామర్థ్యం సాధించాలంటే ముందుగా మనిషిలాగా ఇలా జారాలి. వెంటనే సర్దుకొని నిలబడగలగాలి’’అని కామెంట్ చేశారు. ‘పార్టీకి వెళ్లొస్తూ తెల్లవారుజామున నాలుగు గంటలకు నేను ఇలాగే నడుస్తా’అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడీ రోబోలు పిల్లాడిలా నడుస్తున్నాయిగానీ చూస్తుండండి త్వరలో ఇవి తుపాకులు పట్టుకుని మన వెంటే పడతాయి’’అని ఇంకొకరు అన్నారు. ‘‘విమానం మెట్ల మీద, సైకిల్ తొక్కుతూ తరచూ పడిపోయే అమెరికా వృద్ధ అధ్యక్షుడు బైడెన్ కంటే ఈ రోబో చాలా బెటర్. పట్టుతప్పినా పడిపోలేదు’’అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశారు.
– న్యూయార్క్