సోమవారం రష్యా దాడితో షాపింగ్ మాల్‌లో చెలరేగుతున్న మంటలు
మాస్కో/కీవ్: అంతర్జాతీయ ఆంక్షల ప్రభావం రష్యాపై తీవ్రంగానే పడుతోంది. దాంతో విదేశీ రుణాల చెల్లింపులో విఫలమైంది. గత 104 ఏళ్లలో రష్యాకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన నేపత్యంలో స్విఫ్ట్‌తో పాటు పలు అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థల నుంచి రష్యాను అంతర్జాతీయ సమాజం దూరం పెట్టిన విషయం తెలిసిందే. దాంతో నిధులున్నా కూడా పలు విదేశీ రుణాలపై 10 కోట్ల డాలర్ల మేర వడ్డీలను నిర్ణీత తేదీలోపు రష్యా చెల్లించలేకపోయింది. ఈ మొత్తాన్ని యూరోక్లియర్ బ్యాంకుకు పంపినా అక్కడే నిలిచిపోయింది. చెల్లింపులు ఆగిపోవడం నిజమేనని రష్యా ఆర్థిక మంత్రి ఆంటోన్ సిల్యానోవ్ అంగీకరించారు. అయితే ఇది అంతర్జాతీయ సహాయ నిరాకరణ ఫలితమే తప్ప ఎగవేత కాదని వివరించారు. ఈ నేపథ్యంలో విదేశీ చెల్లింపులను రష్యన్ బ్యాంకు ద్వారా రూబుల్స్‌లో చెల్లించాలని అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నారు.
లీసిచాన్‌స్క్‌పై నిప్పుల వర్షం
డోన్బాస్‌లోలో ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న చివరి నగరం లీసిచాన్‌స్క్‌పై రష్యా సేనలు సోమవారం నిప్పుల వర్షం కురిపించాయి. దాంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. నాటో దేశాధినేతల భేటీ కొనసాగుతుండగానే రష్యా దాడులను ఉధృతం చేయడం గమనార్హం. గత 24 గంటల్లో రష్యా సాగించిన క్షిపణి దాడుల్లో కనీసం ఆరుగురు పౌరులు మృతిచెందారని, మరో 31 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయం ప్రకటించింది. ఖర్కీవ్, ఒడెసా, మైకోలైవ్ తదితర నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక స్లొవియాన్‌స్క్‌పైనా రష్యా క్లస్టర్ బాంబు ప్రయోగించినట్లు ఉక్రెయిన్ సైనికాధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలు భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. స్లొవియాన్‌స్క్‌లో ఉక్రెయిన్ మిలటరీ బేస్ ఉంది.
1,000 మంది ఉన్న మాల్‌పై... రష్యా క్షిపణి దాడి
ఉక్రెయిన్‌లో సామాన్య పౌరులపైనా రష్యా సేనలు క్షిపణి దాడులు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం మధ్యాహ్నం క్రెమెన్‌చుక్‌లో 1,000 మందికిపైగా జనంతో కిక్కిరిసి ఉన్న ఓ భారీ షాపింగ్ మాల్‌పై రష్యా భీకర దాడికి దిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా మరణించారని, 40కి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదముందన్నారు. దాడి తర్వాత షాపింగ్ మాల్ మంటల్లో చిక్కుకుంది. జనం హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. క్రెమెన్‌చుక్‌లో రష్యా క్షిపణి దాడి పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. బాధితుల సంఖ్యను ఊహించడం సాధ్యం కాదని చెప్పారు. రష్యా నుంచి మర్యాద, మానవత్వాన్ని ఆశించడం అత్యాశే అవుతుందన్నారు. సాధారణ జనజీవితాలను రష్యా అస్తవ్యస్తం చేస్తోందని మండిపడ్డారు. సెంట్రల్ ఉక్రెయిన్‌లో ఉన్న క్రెమెన్‌చుక్ ప్రముఖ పారిశ్రామికకేంద్రంగా అభివృద్ధి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment