
మాస్కో : ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్‌గా రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ నమోదైందని అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రకటించిన కొద్దివారాల అనంతరం వ్యాక్సిన్ విస్తృత పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ వారంలోనే సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సహకారంతో గమలేయా ఇనిస్టిట్యూట్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. మరికొద్ది రోజుల్లోనే స్పుత్నిక్ వీకి అనుమతి లభించనుందని, పౌరుల వినియోగానికి నిర్ధిష్ట విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అసోసియేట్ మెంబర్ డెనిస్ లగునోవ్ తెలిపారు. సెప్టెంబర్ 10 నుంచి 13 మధ్య అనుమతుల ప్రక్రియ ముగించుకుని కరోనా వైరస్ వ్యాక్సిన్ తొలి బ్యాచ్ విడుదలవుతుందని చెప్పారు. అదే రోజు నుంచి ప్రజలకు వ్యాక్సిన్‌ను ఇవ్వడం మొదలవుతుందని తెలిపారు.
ప్రజలందరూ వ్యాక్సిన్ కోసం రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చని అయితే ముందుగా హైరిస్క్ గ్రూపులకు ప్రాధాన్యత ఇస్తారని వివరించారు. తొలుత వైద్య సిబ్బంది, వృద్ధులు వంటి హైరిస్క్ గ్రూపులకు వ్యాక్సిన్ ఇవ్వాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ లక్ష్యంగా నిర్ధేశించుకుందని చెప్పారు. మరోవైపు మూడో దశ వ్యాక్సిన్ పరీక్షలపై స్పష్టత లేకుండానే వ్యాక్సిన్‌ను ప్రజల్లోకి తీసుకురావడం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఆగస్ట్ 11న స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమ కుమార్తెల్లో ఒకరికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు స్వయంగా ఆయన వెల్లడించారు. ఇక రష్యాలో 10,27,334 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జాన్‌హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా గణాంకాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment