
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇకపై పదవిలో కొనసాగబోరనే వార్తలు వినపడుతున్నాయి. పార్కిన్‌సన్స్ వ్యాధి కారణంగా పుతిన్ జనవరిలో పదవి నుంచి వైదొలగే వీలుందని వార్తలొచ్చాయి. పుతిన్ ప్రియురాలు 37 ఏళ్ళ ఎలీనా కబేవా, ఆయన కుమార్తెలు పుతిన్‌ని పదవి నుంచి దిగిపోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు, మాస్కోకి చెందిన రాజకీయ విశ్లేషకులు వలేరి సొలోవే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘ద డెయిలీ మెయిల్’ఒక కథనాన్ని ప్రచురించింది. పుతిన్ పార్కిన్‌సన్స్ వ్యాధితో బాధపడుతూ ఉండి ఉండవచ్చునని సొలేవే తెలిపారు.
పుతిన్ పాదాల కదలికలో తేడాలున్నాయని, ఆయన కుర్చీని గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్న దృశ్యాలు బయటపడ్డాయని, ఆయన పక్కనున్న కప్పు నిండా మాత్రలున్నాయని ఆయన తెలిపారు. పుతిన్ త్వరలోనే నూతన ప్రధానిని నియమిస్తారని, ఆయనను తన వారసుడిగా తయారు చేస్తారని సొలోవే తెలిపినట్లు న్యూయార్క్ పోస్ట్ ప్రచురించింది. ఇదిలా ఉండగా పుతిన్ పదవి నుంచి దిగిపోతారనే ప్రచారాన్ని రష్యా అధికార వర్గాలు తోసిపుచ్చాయి. పదవి నుంచి వైదొలగే అవకాశమే లేదని క్రిమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment