
మాస్కో : రష్యా విపక్ష నేత అలక్సీ నావల్సీపై విషప్రయోగం జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తును అడ్డుకునేందుకు జర్మనీ ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపించింది. నవాల్నీ కేసుపై రష్యా వివరణ ఇవ్వాలని లేనిపక్షంలో ఆంక్షలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బెర్లిన్ హెచ్చరించిన నేపథ్యంలో మాస్కో స్పందించింది. రష్యన్ ప్రాసిక్యూటర్లు ఆగస్ట్ 27న పంపిన వినతిపై స్పందించడంలో జర్మన్ అధికారులు విఫలమయ్యారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియ జఖరవ ఆరోపించారు. సోవియట్ యూనియన్‌లో తయారయ్యే విషపూరిత రసాయనం నోవిచోక్‌ను నావల్నీపై మాస్కో ప్రయోగించిందనే ఆరోపణలపై రష్యా వివరణ ఇవ్వాలని జర్మన్ విదేశాంగ మంత్రి హీకో మాస్ డిమాండ్ చేసిన అనంతరం రష్యా ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేశారు.
జర్మనీ ప్రభుత్వం తమ ప్రకటనలపై చిత్తశుద్ధితో ఉంటే రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం పంపిన వినతపై సత్వరమే బదులిచ్చేదని మరియ ఎద్దేవా చేశారు. జర్మనీ డబుల్ గేమ్ ఆడుతోందా అనే సందేహాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. గత నెలలో విమానంలో అస్వస్థతకు గురైన నావల్నీ ప్రస్తుతం సైబీరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నావల్నీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉన్నారు. సైబీరియాలోని టోమ్‌స్క్ నగరం నుంచి మాస్కోకి విమానంలో వెళుతుండగా అనారోగ్యానికి గురవడంతో ఓమ్‌స్క్ నగరంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు నావల్నీ అధికార ప్రతినిధి కిరా యర్మిష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చదవండి : ‘పుతిన్‌కు అర్ధమయ్యే భాషలోనే బదులిద్దాం’
Comments
Please login to add a commentAdd a comment