రష్యా ఆక్రమణలోని ఆయుధాగారంపై ఉక్రెయిన్ దాడి
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్‌లో ఒక భాగమైన సీవిరోడోంటెస్క్‌ను పూర్తిస్థాయిలో చేజిక్కించుకునేందుకు రష్యా దళాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఉక్రెయిన్–రష్యా సైనికుల మధ్య వీధి పోరాటాలు జరుగుతున్నాయి. ప్రత్యర్థులతో తమ సైనికులు వీరోచితంగా తలపడుతున్నారని లుహాన్‌స్క్ గవర్నర్ సెర్హివ్ హైడై గురువారం ప్రకటించారు. ప్రతి వీధిని, ప్రతి ఇంటిని కాపాడుకోవాలన్న లక్ష్యంతో రష్యా సేనలను ఢీకొంటున్నారని తెలిపారు.
విలువైన బొగ్గు గనులు, పరిశ్రమలతో కూడిన డోన్బాస్‌పై రష్యా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇక్కడ రష్యా అనుకూల వేర్పాటువాదులు చాలాకాలంగా ఉక్రెయిన్ దళాలపై పోరాడుతున్నారు. సీవిరోడోంటెస్క్ కోసం రష్యా సైన్యం–ఉక్రెయిన్ సైన్యం వీధి పోరాటాలకు దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. యుద్ధంలో ఇలాటి పరిణామం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరోవైపు పశ్చిమ ఉక్రెయిన్‌లో జైటోమైర్‌లోని సైనిక శిక్షణ కేంద్రంపై క్షిపణి దాడులు నిర్వహించామని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.
ఇక్కడ కిరాయి సైనికులకు ఉక్రెయిన్ శిక్షణ ఇస్తోందని పేర్కొంది. సీవిరోడోంటెస్క్ సమీపంలోని లీసిచాన్‌స్క్‌పైనా రష్యా దాడులు ఉధృతమయ్యాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరాయంగా రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. డోన్బాస్ గతిని సీవిరోడోంటెస్క్ నిర్ణయిస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. రష్యాను బలహీనం చేసేందుకు అందరూ ముందుకు రావాలన్నారు.
నిత్యం 100 మంది ఉక్రెయిన్ జవాన్లు బలి
రష్యా సైన్యం దాడుల్లో నిత్యం 100 మంది దాకా తమ సైనికులు మరణిస్తున్నారని ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ తెలిపారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. రక్తపాతం బాధాకరమని పేర్కొన్నారు. తమ బిడ్డలను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ముగ్గురు విదేశీయులకు మరణ శిక్ష
యుద్ధంలో ఉక్రెయిన్ తరపున పోరాడినందుకు గాను ఇద్దరు బ్రిటిష్ పౌరులు, ఒక మొరాకో పౌరుడికి రష్యా అనుకూల వేర్పాటువాదులు మరణశిక్ష ఖరారు చేశారు. ఉక్రెయిన్‌లో తమ చేతికి చిక్కిన ఈ ముగ్గురిపై కిరాయి సైనిక కార్యకలాపాలు, ఉగ్రవాదం అనే అభియోగాలు మోపారు. తూర్పు ఉక్రెయిన్‌లో ‘డోంటెస్క్ పీపుల్స్ రిపబ్లిక్’ పేరిట తామే సొంతంగా ఏర్పాటు చేసుకున్న దేశంలోని కోర్టు ద్వారా విచారణ జరిపారు. నేరం రుజువైందని పేర్కొంటూ ముగ్గురికి గురువారం మరణ శిక్ష విధించారు.
తమను అధికారం నుంచి కూలదోసేందుకు ఈ మగ్గురూ కుట్ర పన్నారని వేర్పాటువాదులు ఆరోపించారు. నిజానికి ‘డోంటెస్క్ పీపుల్స్ రిపబ్లిక్’కు అధికారికంగా ఎలాంటి గుర్తింపు లేదు. ముగ్గురు బాధితులను ఐడెన్ అస్లిన్, షౌన్ పిన్నర్, సౌదున్ బ్రహీమ్‌గా గుర్తించినట్లు రష్యా వార్తా సంస్థ వెల్లడించింది. మరణశిక్షపై న్యాయస్థానంలో అప్పీలు చేసుకొనేందుకు వారికి నెల గడువిచ్చినట్లు తెలిపింది. ఈ ముగ్గురూ ఉక్రెయిన్‌లో కిరాయి సైనికులుగా పని చేస్తున్నారని వేర్పాటువాదులు చెబుతున్నారు. పిన్నర్, అస్లిన్ ఏప్రిల్‌లో మారియూపోల్‌లో, బ్రహీమ్ మార్చిలో వోల్నోవాఖాలో రష్యా అనుకూల వేర్పాటువాదుల చేతికి చిక్కారు.
Comments
Please login to add a commentAdd a comment