Street fighting
-
Russia-Ukraine war: వీధుల్లో హోరాహోరీ
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్లో ఒక భాగమైన సీవిరోడోంటెస్క్‌ను పూర్తిస్థాయిలో చేజిక్కించుకునేందుకు రష్యా దళాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఉక్రెయిన్–రష్యా సైనికుల మధ్య వీధి పోరాటాలు జరుగుతున్నాయి. ప్రత్యర్థులతో తమ సైనికులు వీరోచితంగా తలపడుతున్నారని లుహాన్స్క్ గవర్నర్ సెర్హివ్ హైడై గురువారం ప్రకటించారు. ప్రతి వీధిని, ప్రతి ఇంటిని కాపాడుకోవాలన్న లక్ష్యంతో రష్యా సేనలను ఢీకొంటున్నారని తెలిపారు. విలువైన బొగ్గు గనులు, పరిశ్రమలతో కూడిన డోన్బాస్‌పై రష్యా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇక్కడ రష్యా అనుకూల వేర్పాటువాదులు చాలాకాలంగా ఉక్రెయిన్ దళాలపై పోరాడుతున్నారు. సీవిరోడోంటెస్క్ కోసం రష్యా సైన్యం–ఉక్రెయిన్ సైన్యం వీధి పోరాటాలకు దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. యుద్ధంలో ఇలాటి పరిణామం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరోవైపు పశ్చిమ ఉక్రెయిన్‌లో జైటోమైర్‌లోని సైనిక శిక్షణ కేంద్రంపై క్షిపణి దాడులు నిర్వహించామని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఇక్కడ కిరాయి సైనికులకు ఉక్రెయిన్ శిక్షణ ఇస్తోందని పేర్కొంది. సీవిరోడోంటెస్క్ సమీపంలోని లీసిచాన్స్క్పైనా రష్యా దాడులు ఉధృతమయ్యాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరాయంగా రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. డోన్బాస్ గతిని సీవిరోడోంటెస్క్ నిర్ణయిస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. రష్యాను బలహీనం చేసేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. నిత్యం 100 మంది ఉక్రెయిన్ జవాన్లు బలి రష్యా సైన్యం దాడుల్లో నిత్యం 100 మంది దాకా తమ సైనికులు మరణిస్తున్నారని ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ తెలిపారు. ఈ మేరకు ఫేస్బుక్లో పోస్టు చేశారు. రక్తపాతం బాధాకరమని పేర్కొన్నారు. తమ బిడ్డలను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు విదేశీయులకు మరణ శిక్ష యుద్ధంలో ఉక్రెయిన్ తరపున పోరాడినందుకు గాను ఇద్దరు బ్రిటిష్ పౌరులు, ఒక మొరాకో పౌరుడికి రష్యా అనుకూల వేర్పాటువాదులు మరణశిక్ష ఖరారు చేశారు. ఉక్రెయిన్‌లో తమ చేతికి చిక్కిన ఈ ముగ్గురిపై కిరాయి సైనిక కార్యకలాపాలు, ఉగ్రవాదం అనే అభియోగాలు మోపారు. తూర్పు ఉక్రెయిన్‌లో ‘డోంటెస్క్ పీపుల్స్ రిపబ్లిక్’ పేరిట తామే సొంతంగా ఏర్పాటు చేసుకున్న దేశంలోని కోర్టు ద్వారా విచారణ జరిపారు. నేరం రుజువైందని పేర్కొంటూ ముగ్గురికి గురువారం మరణ శిక్ష విధించారు. తమను అధికారం నుంచి కూలదోసేందుకు ఈ మగ్గురూ కుట్ర పన్నారని వేర్పాటువాదులు ఆరోపించారు. నిజానికి ‘డోంటెస్క్ పీపుల్స్ రిపబ్లిక్’కు అధికారికంగా ఎలాంటి గుర్తింపు లేదు. ముగ్గురు బాధితులను ఐడెన్ అస్లిన్, షౌన్ పిన్నర్, సౌదున్ బ్రహీమ్గా గుర్తించినట్లు రష్యా వార్తా సంస్థ వెల్లడించింది. మరణశిక్షపై న్యాయస్థానంలో అప్పీలు చేసుకొనేందుకు వారికి నెల గడువిచ్చినట్లు తెలిపింది. ఈ ముగ్గురూ ఉక్రెయిన్‌లో కిరాయి సైనికులుగా పని చేస్తున్నారని వేర్పాటువాదులు చెబుతున్నారు. పిన్నర్, అస్లిన్ ఏప్రిల్‌లో మారియూపోల్‌లో, బ్రహీమ్ మార్చిలో వోల్నోవాఖాలో రష్యా అనుకూల వేర్పాటువాదుల చేతికి చిక్కారు. -
గల్లీల్లో ఘర్షణ.. టెన్షన్లో జనం
సాక్షి, అంబర్‌పేట(హైదరాబాద్): ఆకతాయిలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. గల్లీ ఘర్షణలు ఎక్కువవుతున్నాయి. అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు బస్తీల్లో ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. కాస్త చీకటి పడగానే గల్లీల్లో తిష్టవేసి వారు చేసే ఆగడాలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రేమ్‌నగర్, ఆజాద్‌నగర్, మహ్మద్‌నగర్, న్యూ పటేల్‌నగర్, గోల్నాకలోని లంకా బస్తీలు, దుర్గానగర్ తదితర ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. దీంతో మహిళలు, యువతులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఫిర్యాదులకు కనిపించని స్పందన.. ► ఆకతాయిల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసినప్పుడే తూతూ మంత్రంగా ఘటనా స్థలాన్ని సందర్శించి పోతున్నారు. మితిమీరిన ఆగడాలతో స్థానికులు ఫిర్యాదు చేయడానికి సైతం ధైర్యం చేయడం లేదు. నేరుగా ఫిర్యాదులు చేస్తేనే పట్టించుకుంటామని పోలీసులు తేల్చి చెబున్నారు. ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. మత్తులో యువత హంగామా.. ► యువకులు డ్రగ్స్, మద్యం మత్తులో ఘర్షణ పడుతున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ స్థానికంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. వీరి మధ్యలో అడ్డుపడితే వారిపై సైతం దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు వచ్చినా పోలీసులు పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు లేవు. వారిలో వారు కొట్టుకుంటున్నారులే అనే చందంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం అయిందంటే బయటకు వెళ్లే పరిస్థితి లేదని, పోలీసులు తక్షణమే స్పందించి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు కోరుతున్నారు. చదవండి: మహంకాళి దేవాలయం వద్ద మొండెం లేని మనిషి తల -
స్ట్రీట్‌ఫైట్: ఆ వ్యక్తి ప్రాణాలను తీసింది
హైదరాబాద్: పాతబస్తీలోని డబీర్‌పురాలో దారుణం చోటుచేసుకుంది. అద్నాన్కు, ప్రత్యర్థులైన అజీబ్, ముజీబ్, కమ్రాన్‌లకు మనస్పర్థలున్నాయి. ఈ క్రమంలో ఆ ముగ్గురు కలిసి అద్నాన్‌ను తీవ్రంగా కోట్టారు. ఈ క్రమంలో అద్నాన్ అపస్మారక స్థితిలోనికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్సకోసం ఓక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అయితే, అద్నాన్ చికిత్స పోందుతు మృతి చెందాడు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: అత్తారింట్లో గొడవ: చనిపోతున్నానని సెల్ఫీ వీడియో -
ప్రియురాలి కోసం కొట్టుకున్నారు..
బంజారాహిల్స్: తన ప్రియురాలిని గత రెండు నెలలుగా మాయ మాటలు చెప్పి తన వద్ద ఉంచుకున్నాడంటూ ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఆ యువతి ఉంటున్న ఇంటికి వెళ్లి గొడవ పడటమే కాకుండా ఆమెకు ఆశ్రయం ఇచ్చిన యువకుడిపై తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... విజయవాడ మాచవరంకు చెందిన రేవంత్ బీటెక్ చదివే సమయంలో తన క్లాస్‌మేట్‌తో ప్రేమలో పడ్డాడు. ఐదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల రేవంత్ ప్రవర్తన నచ్చని యువతి అతడితో బ్రేకప్ చేసుకొని బంజారాహిల్స్ రోడ్ నెం.3 అరోరాకాలనీలో ఉంటున్న తన స్నేహితుడు అఖిల్(26) వద్దకు వచ్చింది. కన్సల్టెంట్‌గా పని చేస్తున్న అఖిల్ తన గదిలో ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు. ఇది జీర్ణించుకోలేని రేవంత్ కొద్దిరోజులుగా ఆమెను హెచ్చరిస్తున్నాడు. అక్కడి నుంచి రాకపోతే అంతు చూస్తానని బెదిరించాడు. ఆమెను తన ఇంటికి పంపించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శనివారం రాత్రి అఖిల్‌ను ఫోన్లో బెదిరించాడు. ఆదివారం 30 మంది అనుచరులతో కలిసి ఆమె ఉంటున్న ఇంటి వద్ద గొడవ చేశాడు. అఖిల్‌కు రేవంత్‌కు మధ్య ఘర్షణ జరగడంతో అఖిల్ అతడి స్నేహితులకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రేవంత్, అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్ట్రీట్ ఫైటర్స్
ప్రొద్దుటూరు క్రైం : ఎందుకో తెలియదు.. యువకులందరూ ఒక్కసారిగా గుమికూడుతారు.. ఏ కారణం లేకుం డానే ఒకరిపై మరొకరు దాడులకు తెగపడతారు.. నడి రోడ్డుపై వీరు చేసే బీభత్సం అంతా ఇంతా కాదు.. యువకులు వీధిన పడి తన్నుకునే దృశ్యాలు సినిమా షూటింగ్‌ను తలపించేలా ఉంటాయి. ఈ సంఘటనలు తరచూ ఒకే ప్రాంతంలో జరుగుతుం డటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రొద్దుటూరులోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక గ్యాంగ్ పేరు అందరి నోళ్లలో నానుతోంది. ఆ స్టేషన్ పరిధిలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అందులో ఆ గ్యాంగ్ హస్తం ఉందనే పుకార్లు వినిపిస్తుంటాయి. కొన్ని రోజుల నుంచి కేహెచ్‌ఎం స్ట్రీట్, హైదర్‌ఖాన్ వీధి, రామేశ్వరంపేట, రామేశ్వరం రోడ్డులలో బ్యాచ్‌లు హల్ చల్ చేస్తున్నాయి. వారంలో ఒక రోజైనా ఈ ప్రాంతంలో యువకులు రోడ్డున పడి తన్నుకునే సంఘటనలు జరుగుతున్నట్లు స్థానికులు అంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న 30–40 మంది యువకులు తరచూ జరిగే గొడవలకు కారణమవుతున్నారు. నిఘా నీడలో కేహెచ్‌ఎం స్ట్రీట్ కొన్ని రోజుల నుంచి ఖాదర్‌హుసేన్ మసీదు వీధి పోలీసు నిఘా నీడలో ఉంది. ఇటీవల ఈ వీధిలో ఇరు వర్గాలకు చెందిన యువకులు బాహాబాహీ తలపడ్డారు. పలు మార్లు తలపడటానికి మాటు వేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. రోజూ సమస్యాత్మకంగా ఉండటంతో పోలీసులు ఇటీవల నాలుగైదు రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేశారు. అధికార పార్టీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఈ వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారడంతో ఇటీవల వీధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మకాం మార్చిన యువకులు కొన్ని రోజుల వరకూ ఖాదర్‌హుసేన్ మసీదు వీధిలో తిష్టవేసిన గ్యాంగ్స్టర్స్ ఇప్పుడు రూట్ మార్చారు. ఈ వీధిలో సీసీ కెమెరాలు ఉండటంతో వారి స్థావరాన్ని రామేశ్వరంపేట ప్రాథమిక పాఠశాల సమీపంలోకి మార్చినట్లు తెలుస్తోంది. కొందరు యువకులు అర్ధరాత్రి వరకూ ఇక్కడ మద్యం సేవిస్తూ, దారిలో వెళ్లే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రౌడీల భరతం పడతామని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ చెబుతున్నా ప్రొద్దుటూరులో మాత్రం బ్యాచ్‌ల సంస్కృతి మళ్లీ పురుడుపోసుకుంటోంది. కొన్ని గ్యాంగ్‌లకు రాజకీయ అండ ఉండటంతో పోలీసులు ఉపేక్షిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కౌన్సెలింగ్ పేరుతో ఇటీవల అమాయకులైన కొందరు విద్యార్థులను చితక బాదిన పోలీసులు అసలైన రౌడీలను మాత్రం పట్టుకోలేక పోతున్నారనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. గ్యాంగ్‌లతో భయాందోళనలు ♦ సంక్రాంతి పండుగ ముందు రోజు రాత్రి ఇద్దరు యువకులు సుందరాచార్యుల వీధిలో నడిరోడ్డుపై తన్నుకున్నారు. ఈ క్రమంలోనే తన వద్ద ఉన్న పిడి బాకుతో మరో యువకుడి వీపు భాగంలో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద ఎత్తున జనం గుమి కూడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మైనర్లు కత్తులు దగ్గర పెట్టుకొని తిరగడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటనపై నాలుగు రోజుల వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ♦ కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి ఆటో మాట్లాడుకొని సుందరాచార్యుల వీధిలోని తన దుకాణం వద్ద దిగాడు. ముందుగా మాట్లాడుకున్న దానికంటే రూ.10 తక్కువ ఇవ్వడంతో ఆటో డ్రైవర్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో అతను ఆటో అతన్ని చితక బాదడంతో ముఖంపై గాయం అయింది. ఆ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకుడి సోదరుడికి చెందిన దుకాణంలో ఉత్తరప్రదేశ్ వ్యక్తి మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ♦ అర్ధరాత్రి సమయంలో కొందరు యువకులు తప్ప తాగి తమ ఇళ్ల వద్ద హల్చల్ చేస్తున్నారని ఈశ్వరరెడ్డినగర్కు చెందిన మహిళలు ఇటీవల వన్‌టౌన్ సీఐకి ఫిర్యాదు చేశారు. -
ఒక్క ఫోన్ కొట్టు... పోరాటానికి సిద్ధం
సాక్షి, చెన్నై: ‘ఒక్క ఫోన్ కొట్టండి చాలు... వీధి పోరాటాలకు రెడీ’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్భు పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలి ఎంపిక కసరత్తుల్లో ఆ విభా`గం జాతీయ కమిటీ నిమగ్నమైంది. దీనిపై జాతీయ అధ్యక్షురాలు శోభా ఓజా రంగంలోకి దిగారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు గట్టి పోటీ నెలకొని ఉన్న విషయం తెలిసిందే. పలువురు సీనియర్ నారీమణులు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే ఆ పదవికి ప్రజాకర్షణ కల్గిన మహిళను ఎంపిక చేయాలన్న లక్ష్యంతో ఏఐసీసీ ఉంది. ఇందుకు అన్ని రకాల అర్హతలు పార్టీ అధికార ప్రతినిధి, సినీ నటి కుష్బుకు మాత్రమే ఉన్నదన్న విషయాన్ని ఏఐసీసీ గ్రహించింది. అయితే రాష్ట్రంలో నెలకొన్న పోటీని సామరస్య పూర్వకంగా పరిష్కరించడంతోపాటుగా పార్టీ వర్గాల అభిప్రాయాల్ని సేకరించేందుకు ఆ విభాగం జాతీయ అధ్యక్షురాలు శోభా ఓజా రంగంలోకి దిగారు. సోమవారం చెన్నైలో పార్టీ వర్గాలతో, మహిళా నాయకులతో ఆమె భేటీ నిర్వహించారు. మహిళా విభాగం బలోపేతం లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయడంతోపాటుగా, పార్టీ వర్గాల అభిప్రాయాల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. ఈ సమావేశంలో భాగంగా జరిగిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ పుట్టినరోజు వేడుకలో కుష్బు ప్రసంగం ప్రతి ఒక్కర్ని ఆకట్టుకోవడం గమనార్హం. ఒక్క ఫోన్ కొట్టు: సత్యమూర్తి భవన్ వేదికగా జరిగిన రాహుల్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న శోభా ఓజాను మహిళా నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ మాట్లాడుతూ గతంలో పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా తాను పగ్గాలు చేపట్టానని, ఇప్పుడు అదే పని చేస్తున్నానని గుర్తు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల ద్వారా మళ్లీ కాంగ్రెస్ బలాన్ని చాటుదామని పిలుపు నిచ్చారు. ఇందుకు మహిళా విభాగం బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. అనంతరం కుష్బు మాట్లాడుతూ పార్టీ బలోపేతం, పూర్వ వైభవం లక్ష్యంగా ప్రతి ఒక్కరం సమష్టిగా శ్రమిద్దామని పిలుపు నిచ్చారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న తనను ప్రతి చోటకు ఆహ్వానించే అవకాశం, అధికారిక కార్యకర్తలకు ఉందన్నారు. ‘మీ ఇంటి పక్కనున్న ఏదేని సమస్యకానీయండి, నియోజకవర్గం పరిధిలోని ప్రజా సమస్యలు కానీయండి, ప్రధానంగా ఎలాంటి సమస్య ఎదురైనా నేరుగా కలుసుకుని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ కొట్టండి చాలు... వీధి పోరాటాలకు రెడీ... ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ప్రజల కోసం శ్రమించేందుకు, ఉద్యమించేందుకు సిద్ధం’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సమావేశ మందిరంలో కరతాళ ధ్వనుల్ని మార్మోగించాయి. ఈ సమావేశంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాల్ని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే డి.యశోద, రాణి వెంకటేషన్, మహిళా నాయకురాలు హసీనా సయ్యద్, ప్రస్తుత అధ్యక్షురాలు సాయిలక్ష్మి, ఎమ్మెల్యే విజయ ధరణిలతో పాటుగా పెద్ద సంఖ్యలో మహిళా నాయకులు పాల్గొన్నారు.